మళ్లీ పెరిగిన గోదావరి

చింతూరు బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తున్న శబరి నది

ప్రజాశక్తి-చింతూరు

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి మళ్లీ పెరిగింది. శనివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52.9 అడుగులకు చేరడంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం వరద ఉధృతి తక్కువగా ఉండడంతో 2వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకోగా, మరో రెండు గంటల్లోనే ఎగువ నుండి వరద వచ్చి చేరడంతో మళ్లీ రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 47 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం, మరికొద్ది సమయంలోనే 49 అడుగులకు చేరింది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52.9 అడుగులకు చేరడంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరో వైపు సీలేరు కాంప్లెక్స్‌ పరిధి డొంకరాయి ప్రధాన డ్యామ్‌ నుండి 10,936 క్యూసెక్కుల నీటిని నాలుగు గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు. చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం శనివారం సాయంత్రానికి 40 అడుగులకు చేరువలో ఉంది. గత 15 రోజులుగా వరదలు, వర్షాల కారణంగా వాగులు పొంగడం, రోడ్లు కోతకు గురికావడంతో మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ చింతూరులోనే స్థానికంగా ఉంటూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ బోట్ల ద్వారా లోతట్టు ప్రాంతాలకు నిత్యావసరాలు, కూరగాయలు, మందులు టార్ఫలిట్లు అందజేస్తున్నారు.ఎటపాక : వారం రోజులుగా వరద ఉధృతితో ముంపు గ్రామాల ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద మరికొంత పెరగవచ్చని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. ముంపునకు గురయ్యే ఆవాసాల నుండి ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించాలని సిబ్బందికి అధికారులు దిశా నిర్దేశం చేశారు. శనివారం ఉదయం నుండి జాతీయ రహదారిపై పలుచోట్ల వరద నీరు చేరడంతో భద్రాచలం నుండి చత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాయనపేట, నెల్లిపాక, నందిగామ, మురుమూరు, చెన్నంపేట వద్ద రహదరులపై నీరు చేరుకుంది. చెన్నంపేట రహదారిపై నీరు చేరుకోవడంతో ఎటపాక నుండి చర్ల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ, మురుమూరు గ్రామాలలో ప్రభుత్వ అధికారులు నిత్యవసరాలు పప్పు, ఉప్పు, ఆయిల్‌, బంగాళదుంపలు, ఉల్లిపాయలు పంపిణీ చేశారు. కాగా పెళ్లైన జంటలకు నిత్యావసరాలు అందించకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో వారికి కూడా పంపిణీ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.విఆర్‌.పురం : ఇప్పటికే వడ్డిగూడెం, శ్రీరాంగిరి వంటి పంచాయతీల్లో గ్రామాలు వరదలో ఉండగా, గోదావరి, శబరి మళ్లీ వరద పెరగడంతో మరికొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. విఆర్‌.పురం మండలం వడ్డుగూడెం గ్రామం వద్ద గోదావరి, శబరి నదులు కలుస్తాయి. వీట్లో వరద నీరు పెరగడంతో విఆర్‌.పురం, రాజపేట, మొద్దులగూడెం, అన్నవరం గ్రామాలు మునిగే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ గ్రామాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వారికి బరకాలు, కిరోసిన్‌, బియ్యం, నిత్యవసర సరుకులు, దోమ తెరలు అందించాలని కోరుతున్నారు. రేఖపల్లిలో గుడారాలు వేసుకొని పది రోజులుగా జీవిస్తున్న వరద బాధితులకు అధికారులు వసతులు కల్పించట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూనవరం : గోదావరి వస్తూ పోతూ ముంపు ప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది. శనివారం వరద ఉధృతి పెరగడంతో అధికారులు కూనవరం, టేకులబోరు మధ్య మళ్ళీ బోట్‌ని ఏర్పాటు చేసారు. స్థానిక ఎస్‌ఐ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ వరద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కంట్రోల్‌ రూమ్‌కి సమాచారం అందించాలన్నారు. కొన్ని గ్రామాలు కరెంటు లేక చీకట్లో పిల్లలు, వృద్ధులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కూనవరం, టేకులబోరు, కొండ్రాజు పేట, శబరి కొత్తగూడెం, టేకుబాక గ్రామాలు ముంపునకు గురి అయ్యాయి. ఇంకా ముంపు తీవ్రం అయితే మరిన్ని గ్రామాలు ముంపు బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

➡️