పాడిరైతుల పురోభివృద్ధికి గోకుల షెడ్డులు దోహదం

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : పాడి రైతుల పురోభివఅద్దికి గోకుల షెడ్లు బాసటగా నిలుస్తాయని ఎంపీడీవో, ఇంచార్జ్‌ డిఎల్పిఓ ఏ.రాజు అన్నారు. మండలంలోని నవాబుపేటలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటు చేసిన గోకుల షెడ్డును ఆయన స్థానిక నేతలతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజు మాట్లాడుతూ పాడి, పంటలు మన సంస్కఅతికి పునాదులని వాటిని కాపాడుకోవాలని రైతులకు గుర్తు చేశారు. అందుకే పాడి రైతులకు అండగా నిలిచేందుకు ఈ గోకులం పథకం ఉపయోగ పడుతుందన్నారు. అలాగే మండలంలో మొత్తం 49 గోకులాలు అర్హులకు మంజూరు చేయగా అందులో 22 ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మిగిలిన వాటిని ఈ నెలాఖరులోగా సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణతో తప్పకుండా పూర్తి చెయ్యాలని వారికి ఆదేశించారు. మన పల్లెల్లో సంస్కఅతి, సాంప్రదాయాలను కాపాడుకునేందుకు వీటి నిర్మాణంతో శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్‌ నామాల సత్తిబాబు, మాజీ సర్పంచ్‌ గురు చంద్ర స్వరూప్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పెద్దిరాజు, కూటమి నాయకులు ఈత సుబ్బారావు, గోపి రాముడు, సింగం శెట్టి రాజు, వరసాల అన్నవరం, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️