జిజిహెచ్‌లో గోల..గోల..!

ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి దాడులు.. తిరుగుబాటులతో దద్దరిల్లింది. ఇటీవల ఓ కంపాసినేట్‌ అపాయింట్‌మెంట్‌ విషయంలో డిడి వర్సెస్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇది డిడిపై సీనియర్‌ అసిస్టెంట్‌ బృందం తిరుగుబాటుకు దారితీసింది. కంపాసినేట్‌ అపా యింట్‌మెంట్‌ ఫైలును సకాలంలో ఎందుకు పంపించలేదనే మందలింపు డిప్యూటీ డైరెక్టర్‌కు వ్యతిరేకంగా లేఖ రాయడానికి దారితీసినట్లు సమాచారం. సదరు లేఖపై 12 మంది కార్యాలయ సిబ్బందిలో ఇద్దరు మహిళా ఉద్యోగులు సంతకం చేయలేదనే ఆగ్రహంతో ఓ మహిళా సూపరింటెండెంట్‌పైకి ముగ్గురు సిబ్బంది దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది. ఆమె చేసేదేమీ లేక 101కు ఫోన్‌ చేసి పోలీస్‌ సహాయన్ని ఆశ్రయించినట్లు సమాచారం. పోలీసు, ఓ మహిళా ఆర్‌ఎం మధ్యవర్తిత్వంతో ఘర్షణ వాతావరణం సద్దుమణిగినట్లు తెలుస్తోంది. ఘర్షణ వాతావరణానికి గల కారణం 10 రోజుల్లో సీనియర్‌ అసిస్టెంట్‌కు ఉద్యోగోన్నతి వ్యవహారమేనని తెలుస్తోంది. జిజిహెచ్‌లో ఉన్న ముగ్గురు ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ల్లో ఇద్దరు స్థానికేతరులు. వీరిలో ఒకరిని సరెండర్‌ చేయాలని కోరడం, అతని స్థానంలో సదరు సీనియర్‌ అసిస్టెంట్‌ రావాలనుకోవడం, సహేతుక కారణాలు లేనిదే సరెండర్‌ చేయడమెలా అని డిప్యూటీ డైరెక్టర్‌ నిరాకరించడం, స్పౌస్‌ను నిర్ధారించే వ్యవహారంపై సూపరింటెండెంట్‌ ఎస్‌ఆర్‌లు పరిశీలన చేయకుండా సంతకం చేయలేదనే ఆక్కసు ఘర్షణ వాతావరణానికి తోడైనట్లు తెలిసింది. సీనియర్‌ అసిస్టెంట్‌ బృందం సైతం తమ పట్ల డిప్యూటీ డైరెక్టర్‌ దురుసుగా వ్యవహరించాడని, స్పౌస్‌ సంతకం విషయం ఇబ్బంది పెడుతున్నారనే వాదన వినిపిస్తున్నారని ఫిర్యాదు చేశారని డిప్యూటీ సూపరింటెండెంట్‌ పేర్కొనడం గమనార్హం. ఇలా ఎవరి వాదన వారిది అన్న చందంగా ఉందని చెప్పవచ్చు. కొన్నేళ్లుగా జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ పర్యవేక్షణ కొరవడిన ఫలితమే ఘర్షణ వాతావరణానికి కారణమనే వాదన వినిపిస్తోంది. జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆనారోగ్య కారణాల పేరుతో చురుకుగా పనిచేయడం లేదనే విమర్శ పెద్దఎత్తున వినిపిస్తోంది.ఘర్షణ వాతావరణం నిజమే! జిజిహెచ్‌లో ఘర్షణ వాతావరణం నెలకొన్న మాట నిజమే. డిడి తమ పట్ల దురుసుగా వ్యవహరించారనే పేరుతో సీనియర్‌ అసిస్టెంట్‌ బృందం ఫిర్యాదు చేసింది. దీనిపై డిడి, సీనియర్‌ అసిస్టెంట్‌ బృందాల్ని పిలిపించి ఇరువురిని మందలించి సర్దుబాటు చేశానని పేర్కొనడం గమనార్హం.- సురేశ్వరరరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్‌, జిజిహెచ్‌, కడప.

➡️