ప్రజాశక్తి-కొమరోలు : కొమరోలు మండలం అల్లీనగరం శ్రీ మునగనూరి వెంకటసుబ్బయ్య అండ్ సన్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రధానోపాధ్యాయులు దాసరి గురుస్వామి అధ్యక్షతన గత విద్యా సంవత్సరంలో 220 రోజులకు 200 రోజులు పైగా పాఠశాలకు హాజరైన విద్యార్థులకు గోల్డ్ మెడల్ ప్రదానోత్సవం ఆనందోత్సాహాలతో కన్నుల పండువలా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కొమరోలు మండలం రెండో విద్యాశాఖ అధికారి వెంకటరత్నం హాజరై గోల్డ్ మెడల్, వెండి మెడల్, రాగి మెడల్ పొందడం ఒలంపిక్ గేమ్స్‌లో చూస్తామని, అలాంటి గొప్ప కార్యక్రమం అల్లీనగరం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు దాసరి గురుస్వామి ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మరొక ముఖ్య అతిథి రాష్ట్ర జన విజ్ఞాన వేదిక నాయకులు స్వరూప రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆటిట్యూడ్, బిహేవియర్, క్యారెక్టర్, డెడికేషన్, టార్గెట్ ఇవన్నీ కలిగి ఉండాలని, అప్పుడు విద్యార్థులు ప్రతిభావంతులుగా తయారై తనను తాను ఎంచుకున్న స్థాయిని పొందుతారని స్వరూపరెడ్డి తెలిపారు. అల్లీనగరం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు దాసరి గురుస్వామి మాట్లాడుతూ గోల్డ్ మెడల్ బహూకరణ వల్ల విద్యార్థుల హాజరు శాతం పెరగడం వలన విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, క్రీడలు ఇలా అన్ని రంగాల్లో రాణిస్తారని, అందుకే పాఠశాలలో గోల్డ్ మెడల్ ప్రదానోత్సవం ఏర్పాటు చేశానని అన్నారు. గోల్డ్ మెడల్ పొందిన విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎన్‌వి నారాయణ, కోటేశ్వరరావు, సుజాత, చంద్రమోహన్, ప్రకాశరావు, శివరాం, గురువయ్య, సిబ్బంది అశ్విని దేవి, ఎర్రగుంట్ల ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రగిరి శ్రీనివాసులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
