ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కళాకారులు సమాజాన్ని చైతన్యపరుస్తారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగలి పోతన్న అన్నారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది కళాకారులేనని పేర్కొన్నారు. ప్రజా కళాకారులు డాక్టర్ గరికపాటి రాజారావు, పద్మశ్రీ షేక్ నాజర్ జయంతి సందర్భంగా … బుధవారం నవ్యాంధ్ర ప్రజా గ్రంధాలయంలో కళాకారులకు సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రొంగలి పోతన్న మాట్లాడుతూ … కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా సమాజానికి అవసరమైన మంచి సందేశాలను తెలియజేస్తారని అన్నారు. ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడంలో కళాకారులు పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందన్నారు. జానపద కళాకారుల జిల్లా అధ్యక్షుడు పి.షణ్ముఖరావు మాట్లాడుతూ మానవుల జీవితంలో కలలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, మనిషి జీవితం ఆటపాటలతో ముడిపడి ఉందని అన్నారు. ఆట, పాట, మాటల ద్వారా కళాకారులు సమాజాన్ని ఉత్తేజపరుస్తారని తెలిపారు. ప్రజా కళాకారులు డాక్టర్ గరికిపాటి రాజారావు, పద్మశ్రీ షేక్ నాజర్ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ కళాకారులను సత్కరించడం జరిగిందని తెలిపారు. అనంతరం 15 మంది సభ్యులతో కూడిన జిల్లా నవ్యాంధ్ర ప్రజా మండలి కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ జిల్లా అధ్యక్షులుగా గండ్రేటి శ్రీను (డప్పు శ్రీను), కార్యదర్శిగా మన్నెపురి అప్పలనాయుడు ఎంపిక చేశారు.
