ఈ-పోస్ట్‌ ద్వారా ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు

Jun 10,2024 23:47

ప్రజాశక్తి-గుంటూరు : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు, ముఖ్యమంత్రు, ప్రధాన మంత్రికి ఈ-పోస్ట్‌ ద్వారా అభినందనలు తెలిపేందుకు తపాలా శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని గుంటూరు డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ యలమందయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ప్రజా ప్రతినిధికి కేవలం రూ.10ల (జిఎస్‌టి అదనం) రుసుం చెల్లించి, దగ్గరలోని ఏదైనా పోస్టాఫీసులో ఈ-పోస్ట్‌ ద్వారా తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు పంపవచ్చన్నారు. ఇలా పంపిన సందేశాలు నేరుగా మీ అభిమాన నాయకుల చేతికి చేరతాయన్నారు. ఈ-పోస్ట్‌ ద్వారా ప్రజలు 155000 కంటే ఎక్కువ పోస్ట్‌ ఆఫీసుల నెట్‌వర్క్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌మిషన్‌, ఫిజికల్‌ డెలివరీ కలయికతో దేశంలోని ఏ చిరునామాకైనా తమ సందేశాలు పంపించవచ్చని వివరించారు. ఇంటర్నెట్‌ ద్వారా ఈ-పోస్ట్‌ సందేశాలను సాఫ్ట్‌ కాపీగా పంపుతుందన్నారు. గమ్యస్థానంలో అది హార్డ్‌కాపీ రూపంలో చిరునామాదారునికి డెలివరీ చేయబడుతుందన్నారు. ఎ4 పరిమాణం గల పేజీని ఈ పోస్ట్‌ ద్వారా పంపించవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

➡️