గోర్జి ఆక్రమణతో నీరందడం లేదు

Mar 16,2025 20:46

ప్రజా చైతన్యయాత్రలో సిపిఎం బృందం ఎదుట రైతుల ఆవేదన

ప్రజాశక్తి-తెర్లాం : బండిగోర్జిని ఓ వ్యక్తి ఆక్రమించడంతో తోటపల్లి కుడి కాలువ నుంచి సుమారు 19 ఏళ్లుగా సాగునీరు అందడం లేదని రైతులు.. సిపిఎం బృందం ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సిపిఎం బృందం తెర్లాం మండలంలో ఆదివారం పర్యటించింది. ఈ సందర్భంగా సతివాడ, అప్పలంపేట, బూరుపేట, సింగిరెడ్డివలస మీదుగా వెళ్తున్న తోటపల్లి కుడికాలువను పరిశీలించింది. ఈ సందర్భంగా సతివాడ రైతులతో మాట్లాడగా, కాలువ నుంచి సాగునీరు అందడం లేదని సిపిఎం నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. నెమలాం గ్రామానికి చెందిన వ్యక్తి.. తోటపల్లి కుడి కాలువ నుంచి నీరు వచ్చే బండిగోర్జిని ఆక్రమించడంతో సతివాడలోని లింగయ్యచెరువుకు నీరు రావడం లేదని చెప్పారు. 19 ఏళ్లుగా ఈ సమస్యను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోలేదని వాపోయారు. దీనివల్ల ఆరు గ్రామాల పరిధిలో 1500 ఎకరాలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సుమారు 300 మీటర్లు నాటుబండి వెళ్లే కాలువ ఇదని, పక్కాగా ప్రభుత్వ భూమని, ఆక్రమణకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.శంకరరావు, నాయకులు ఎస్‌.గోపాలం మాట్లాడుతూ సాగునీటి సమస్యపై ఈ నెల 20న తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని, రైతులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.రామారావు, ధనంజయ, తదితరులు పాల్గొన్నారు.

➡️