గోశాలలు రైతులకా… రాజకీయ నేతలకా?

Nov 26,2024 21:42

మండల సమావేశంలో అధికారులను నిలదీసిన సభ్యులు

ప్రజాశక్తి – మక్కువ : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ మందిరంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశం మంగళవారం వాడీగా వేడిగా జరిగింది. ఎంపిపి మర్రి పారమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కాలం అతీతమైన సభ ముందుకు సాగింది. తొలుత భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాణ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ప్రతిజ్ఞ చేసి, రాజ్యాంగ పీఠికను చదివారు. అనంతరం జరిగిన అధికారుల సమీక్షలో ఎపిఒ ఈశ్వరమ్మ గోసాలల గురించి మాట్లాడుతుండగా సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. రాజకీయ నాయకులకే ఎక్కువ కేటాయించారని, ఇందులో రైతులు తక్కువగా ఉన్నారని అన్నారు. జెడ్‌పిటిసి సభ్యులు మావుడి శ్రీనివాసరావు మాట్లాడుతూ గోసాలలకు పంచాయతీల తీర్మానం అవసరం లేదా అని ప్రశ్నించారు. మండలానికి కేవలం 17 మాత్రమే గోసాలలు మంజూరయ్యాయని సభలో పేర్లు వివరించారు. దీంతో 400కు పైగా దరఖాస్తులు తీసుకున్నప్పటికీ 17 కేటాయించడమేమిటిని సర్పంచులు నిలదీశారు. పంచాయతీరాజ్‌ ఎఇ రజిత సభకు వివరిస్తుండగా శంబర పోలమాంబ ఆలయ పరిసరాల్లో నిర్మిస్తున్న రహదారులు నాణ్యతగా నిర్మించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్‌ అధికారులు పైనే ఉందని జడ్పిటిసి అన్నారు. ఆదిలోనే నాణ్యత లోపం జరగడం దారుణమన్నారు. విద్యుత్‌ స్తంభాల్లేక అనేక మంది రైతులు అవస్థలు పడుతున్నారని పలువురు సర్పంచులు సభలో ఎఇని నిలదీశారు. అలాగే పోలమాంబ వనం గుడి వద్ద రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్‌ స్తంభాలను కూడా వెంటనే తొలగించాలని సభ్యులు కోరారు. దీనిపై విద్యుత్‌ ఎఇ జోగినాయుడు మాట్లాడుతూ వాటి పరిష్కారానికి ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. శంబరంలో అంగన్వాడీ భవనం రెండో అంతస్తులో నిర్వహించడం పట్ల తహశీల్దార్‌ ఇబ్రహీం అంగన్వాడీ సిడిపిఒను వివరణ కోరారు. వెంటనే కేంద్రాన్ని వేరేచోటకు మార్చాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️