గొట్టిపాటి లక్ష్మి నేడు దర్శికి రాక

ప్రజాశక్తి-దర్శి దర్శిలో పోటీ చేస్తున్న తెలుగుదేశం కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి బుధవారం దర్శి నియోజకవర్గంలోకి తొలిసారిగా వస్తున్నారు. ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆమె భర్త, మామలు మండల ముఖ్య నేతలతో వ్యూహాత్మక భేటీలు పూర్తి చేశారు. మండలాల్లో పార్టీ నేతలతో మంతనాలు సాగించారు. జనసేన నేతలను కలిశారు. జిల్లా నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నాడు దర్శిలో పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పార్టీ జిల్లా నేతలను కూడా ఆహ్వానించారు. దర్శిలో రెండు పార్టీల నుంచి డాక్టర్లుగా ఉన్నవారే అభ్యర్థులుగా తలపడుతున్నారు. దర్శిలో ఉత్కంఠ పోరుకు మరోసారి రంగం సిద్ధమైంది. దర్శిలో తెలుగుదేశం అభ్యర్థి ప్రకటనలో అసాధారణ జాప్యం జరిగింది. పార్టీ వర్గాలు అభ్యర్థి కోసం ఎదురుచూస్తున్నాయి. నాన్చుడు వల్ల నష్టం జరిగిందనే భావన కూడా పెరిగింది. ఎట్టకేలకు దర్శికి అభ్యర్థిని ఖరారు చేశారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సోదరుడు నరసయ్య కుమార్తె లక్ష్మి. ఈమె భర్త కడియాల లలిత్‌కుమార్‌ కూడా వైద్యులే. కడియాల కుటుంబం నరసరావు పేటలో తెలుగుదేశం పార్టీకి కీలకంగా పనిచేశారు. కోడెల శివప్రసాద్‌కు మంచి అనుచరులుగా ఉన్నట్లు చెబు తున్నారు. రాజకీయాలతో సంబం ధం ఉన్న కుటుంబమే. ఈ నేపథ్యంలో దర్శి టిక్కెట్టు కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బంధుత్వం ఉన్న నేపథ్యంలో గొట్టిపాటి రవికుమార్‌ను సంప్రదించారు. టిక్కెట్టు ఇప్పించాలని కోరారు. చంద్రబాబుతో కలిసి చర్చించారు. తర్జనభర్జనల అనంతరం గొట్టిపాటి లక్ష్మి పేరును ఖరారు చేశారు. ఇపుడు నియోజకవర్గంలో గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. అటు ఎమ్మెల్యే గొట్టిపాటి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన కూడా ఇక్కడ ఎలా ముందుకుపోవాలన్న దానిపై దిశానిర్దేశం చేస్తున్నారు. మండలాల్లో ఎవరికి కీలక బాధ్యతలు అప్పగించాలి? ఇతర విషయాలు ఎలా సమర్థవంతంగా నిర్వహించాలనే దానిపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ముండ్లమూరు మండలంలో గొట్టిపాటికి మార్టూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి సంబంధాలున్నందున ఇది కూడా కలిసివచ్చిందని భావిస్తున్నారు. నేరుగా గొట్టిపాటి పలువురు నేతలతో మాట్లాడారు. మిగతా మండలాల్లోనూ పార్టీపరంగా నేతలతోనే మాట్లాడుతున్నారు. దర్శి నియోజకవర్గంలో పాతికేళ్ల నుంచి ఉన్న గొట్టిపాటి రాజకీయ సంబంధాలను గుర్తుచేస్తున్నారు. దర్శి ఉప ఎన్నికల్లో అప్పట్లో నారపుశెట్టి పాపారావు గెలుపునకు అప్పట్లో మంత్రిగా ఉన్న గొట్టిపాటి హనుమంతరావు కీలకపాత్ర పోషించారు. ఈ విషయాన్ని ఇపుడు నియోజకవర్గంలో పలువురు నేతలు ప్రస్తావించుకుంటున్నారు. ఇవి కూడా దోహదపడతాయని భావిస్తున్నారు. ఇక పార్టీ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం కూడా సవాలుగా మారింది. అనేక అవరోధాలను అధిగమించాల్సి ఉంది. ఎందుకంటే వైసిపి అభ్యర్థి బూచేపల్లి ఇప్పటికే ప్రచారం ఒక దశ పూర్తి చేశారు. తెలుగుదేశం నుంచి ఇపుడు ప్రచారంతో పాటు అన్ని రకాల వ్యూహాలను కూడా కొత్తగా నడపాల్సి ఉంది. అయితే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పాత్ర ఇపుడు కీలకంగానే ఉంది. తమ కుటుంబం నుంచి మరో రాజకీయ వారసురాలు రావడంతో ఎమ్మెల్యే రవికుమార్‌ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నారు.

➡️