ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : వంద రోజుల కూటమి ప్రభుత్వంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని వైసిపి జిల్లా అధ్యక్షులు, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం స్థానిక జెడ్‌పి ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యం కోసం గత వైసిపి ప్రభుత్వం పాలన సాగిందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి ప్రజలకు అవసరమైన సేవలు అందించామన్నారు. సుపరిపాలన కోసం సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నేడు వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న కూటమి పాలనలో మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రజలు వద్దకు వెళ్తున్నారని, వంద రోజులు దాటిందో లేదో ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక విధానం వల్ల భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డు ఎక్కుతున్నారన్నారు. తమ ప్రభుత్వంలో స్టాక్ పొయింట్ పెట్టీ టన్ను రూ.700కి ఇచ్చామని, నేడు టన్ను రూ.1800 ఇచ్చినా దొరకని పరిస్తితి నెలకొందని అన్నారు. రైతులకు తాము ఎరువులు రైతు భరోసా కేంద్రాలు ద్వారా అందించామని నేడు ఎక్కడా ఎరువులు అందే పరిస్తితి లేదని అన్నారు. పింఛన్లను గతంలో ఐదు రోజులు వరకూ ఇచ్చేవారిమని ఇప్పుడు ఒక్క రోజులో ఇచ్చేసి తర్వాత పింఛన్లను ఇచ్చే పరిస్థితి లేదన్నారు. దీంతో పాటు చేతివాటం మొదలైం దన్నారు. నీటిలో పంట మునిగిన రైతులకు భరోసా లేకుండా పోయిం దన్నారు. యూరియా, డిఎపి, అధిక ధరలకు అమ్ముతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం బోజన పథకం పై పర్యవేక్షణ లేదన్నారు. ఇటీవలి ఎస్ కోట, బొబ్బిలిలో జరిగిన ఘటనలే దీనికి నిదర్శనమన్నారు. విద్యుత్ భారాలు మోపమని చెప్పి నేడు భారాలు వేసేందుకు సిద్దమయ్యా రన్నారు. భోగాపురం విమానాశ్రయం పనులు నిర్దిష్ట సమయంలో కాంట్రాక్టు తీసుకొన్న ఎల్‌అండ్‌టి వారు చేస్తారని ప్రభుత్వం విమానాశ్రయం కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు. మీ పర్యవేక్షణ ఉన్న లేకున్నా పనులు జరుగుతాయన్నారు. సమావేశంలో వైసిపి నాయకులు నెక్కల నాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు.