అంపశయ్యపై సర్కారు వైద్యం

Mar 26,2025 21:27

దవాఖానాల్లో వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత

పిహెచ్‌సిల్లో ఒకే డాక్టర్‌తో నెట్టుకొస్తున్న వైనం

పనిఒత్తిడితో బెంబేలెత్తిపోతున్న వైద్యాధికారులు

ముంచుకొస్తున్న ఎపిడిమిక్‌ సీజన్‌

ప్రజాశక్తి-సీతంపేట : ‘గిరిజనుల వైద్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాం. కార్పొరేట్‌ తరహాలో మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆస్పత్రి నిర్మాణాలు చేపడుతున్నాం. మీ ప్రాంతంలోనే మీకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామ’ంటూ మన పాలకులు గొప్పలు చెబుతున్నారు. కానీ ఆచరణలో మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారినా పనితీరు మారలేదు. ఆస్పత్రిలో సరిపడా వైద్య అధికారులు, సిబ్బంది లేకపోవడంతో వైద్యానికి రోగులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. 24 గంటలూ పనిచేయాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఒక్కొక్క డాక్టర్‌తోనే నెట్టుకొస్తున్నారు. దీంతో ఉన్న వైద్యులపై పనిఒత్తిడి పెరగడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఏజెన్సీలో మరికొద్ది రోజుల్లో ఎపిడిమిక్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. ఏటా మన్యంలో అధికంగా మలేరియా, టైపాయిడ్‌, వైరల్‌ జ్వరాలు విజృంభిస్తాయి. దీనిని ఎదుర్కోవాలంటే వైద్యులు, సిబ్బందితో పాటు మందులు కూడా పూర్తిస్థాయిలో ఉండాలి. కానీ ఏజెన్సీలోని ప్రభుత్వ దవాఖానాలు వైద్యులు, సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. సీతంపేట ఐటిడిఎ పరిధిలోని ఆస్పత్రుల్లో వైద్యుల కొరతే అందుకు నిదర్శనం. ఐటిడిఎ పరిధిలో 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 11 వైద్యాధికారి పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కుసిమి, దోనుభాయి పిహెచ్‌సిలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 9 పిహెచ్‌సిలో ఉన్నత చదువుల కోసం వైద్యులు వెళ్లిపోయారు. సీతంపేటలో 30 పడకల నుంచి వంద పడకల ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసి ఆరేళ్లు కావస్తోంది. ఈ ఏరియా ఆస్పత్రి సీతంపేట ఏజెన్సీకే కాకుండా భామిని, కొత్తూరు, హిరమండలం, ఆ సమీపంలో ఉన్న ఒడిశాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు పెద్దదిక్కు. అయితే ఇప్పటికీ జనరల్‌ వైద్యుల పోస్టులు నాలుగు ఖాళీ ఉండటంతో ఉన్న వైద్యులపైనే భారం పడుతోంది. డెర్మటాలజిస్ట్‌, మత్తు వైద్యులు, సివిల్‌ సర్జన్‌, సిఎస్‌ఆర్‌ఎం పోస్టులు ఖాళీ ఉండటంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతోపాటు స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు ఏడు ఖాళీలు ఉన్నాయి ఎన్‌ఆర్‌సిలో ఇద్దరు వైద్యాధికారులు, స్టాఫ్‌నర్స్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇంకా జనరల్‌ డ్యూటీ అటెండర్‌ పోస్టులు ఐదు ఖాళీ ఉన్నాయి. ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఎక్స్‌ట్రా టెక్నీషియన్‌, ఫార్మాసిస్ట్‌ పోస్టులు ఖాళీలు ఉండటంతో ఆ సేవలకు కొన్ని సందర్భాల్లో అంతరాయం కలుగుతోంది. వంద పడకల ఆస్పత్రికి తగ్గట్టుగా శానిటేషన్‌ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది లేరు. ఖీ ధోనుబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సుమారు 20 పంచాయతీల వరకు ఉన్నాయి. అక్కడి గిరిజనులకు పిహెచ్‌సినే దిక్కు. అలాంటిది ఏడాదిపైగా పిహెచ్‌సిలో వైద్యాధికారి పోస్టు భర్తీ చేయలేదు. ఉన్న ఒకే వైద్యాధికారితో నెట్టుకొస్తున్నారు. ఆ ప్రాంతంలో అధికంగా మలేరియా, టైపాయిడ్‌ కేసులు నమోదు అవుతాయి. గత ఏడాది అధికంగా ఈ కేసులు వచ్చాయి. ఇక వైద్య సిబ్బంది కొరతా వేధిస్తోంది.ఖీ కుసిమి పిహెచ్‌సిలో ఇద్దరు వైద్యాధికారులకు ఒకరు ఉద్యోగోన్నతిపై వెళ్లిపోయారు. ప్రస్తుతం ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. ఈ పిహెచ్‌సికి రోగుల తాకిడి ఉంటుంది. ఎఎన్‌ఎం పోస్టులు రెండు ఖాళీలు ఉన్నాయి. మల్టీపర్పస్‌ హెల్త్‌ సూపర్వైజర్‌ (మేల్‌) పోస్టు భర్తీ చేయాల్సి ఉంది. ఖీ మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.. చుట్టుపక్కల సుమారు 20 పంచాయతీల గిరిజనులకు ఆధారం. ఇద్దరు వైద్యాధికారులకు ఒకరు ఉన్నత చదువుల కోసం వెళ్లారు. ప్రస్తుతం ఒక వైద్యాధికారితో నెట్టుకొస్తున్నారు. ఎపిడిమిక్‌ సీజన్లో రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. నాలుగు సూపర్‌వైజర్‌ పోస్టులకు మూడు ఖాళీలు ఉన్నాయి. ఖీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటలూ పనిచేసేలా రూపొందించారు. ఉన్న ఇద్దరు వైద్యులు సరిపోవడం లేదు. ఎందుకంటే ఒక వైద్యాధికారి ఆస్పత్రిలో ఒపి చూస్తే, మరో వైద్యాధికారి 104 వాహనం ద్వారా నెలకు 20 రోజులు గ్రామాలను సందర్శిస్తారు. మరో వైద్యాధికారి వైద్య శిబిరాలు, అధికారుల సమావేశాలు, పాఠశాల సందర్శనకు హాజరుకావాలి. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కనీసం ముగ్గురు వైద్యులైనా ఉండాలన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెలాఖరికి భర్తీకి చర్యలు

వైద్యుల పోస్టుల నియామకం ప్రస్తుతానికి ప్రాసెస్‌లో ఉంది. ఈ నెలాఖరుకల్లా వైద్యుల పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటాం. సకాలంలో గిరిజనులకు వైద్య సేవలు అందిస్తాం.

– సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి,పిఒ, సీతంపేట ఐటిడిఎ

➡️