ప్రజాశక్తి-దర్శి: ప్రభుత్వ లక్ష్యాలు ప్రజలకు చేరువయ్యేందుకు వైద్య సిబ్బంది రోగులకు సకాలంలో సేవలు అందించాలని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి డాక్టర్లకు గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి మండలం చందలూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆమె దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పని తీరు, ఆసుపత్రిలో అందుతున్న సేవలపై అక్కడి రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అందుకు తగిన విధంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పని చేయాలని కోరారు. దర్శి నియోజకవర్గంలో ప్రాథమిక వైద్య కేంద్రాలతో పాటు దర్శిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యానికి తాను నిరంతరం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. డాక్టర్ లక్ష్మి చందలూరు ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బ్లెస్సితో అక్కడ వసతులు, లోటు పాట్లు, సిబ్బంది సకాలంలో వస్తున్నారా లేదా ప్రజలకు సేవలు అందుతున్నాయా లేదా అని వివరాలు తెలుసుకొని అవసరమైన పరికరాలు, మిషనరీలు కల్పించేందుకు ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.