ప్రజాశక్తి -తగరపువలస : ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయం ఆవరణలో బుధవారం సాయంత్రం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జిఒ వల్ల ప్రాథమిక పాఠశాల వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదర్శ పాఠశాలల ఏర్పాటు పేరుతో ప్రాథమిక పాఠశాలలను బలహీన పరిచే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. పేద విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేసే ప్రభుత్వ ప్రయత్నాలను,ఆయా పాఠశాలల తల్లి దండ్రుల తో కలిసి ఉపాధ్యాయులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ బడులపై తల్లి దండ్రులకు మరింత నమ్మకం పెంచేలా మన కృషి ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం పిడిఎఫ్ గత 17 ఏళ్లుగా చేస్తున్న కృషి, జరుపుతున్న ఐక్య పోరాటాలను వివరించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోరెడ్ల విజయ గౌరికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులందరినీ కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యయన కమిటీ సభ్యులు డి.రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి టిఆర్.అంబేద్కర్, అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షులు ఎ.పైడిరాజు, కార్యదర్శి ఉప్పాడ రాము, మండల కమిటీ అధ్యక్షులు సిహెచ్‌వి.సంతోష్, ప్రధాన కార్యదర్శి ఎల్‌ఎ.శ్రీనివాస్, సిఐటియు నాయకులు ఆర్‌ఎస్‌ఎన్.మూర్తి, ఎస్.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
