ప్రజాశక్తి-శ్రీకాళహస్తి (తిరుపతి) : ప్రభుత్వాలు వేరైనా.. ఇసుక, మట్టి మాఫియా ఒకటేనని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. వారంతా సిండికేట్లు కావడంతోనే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’గా తమ మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్లు స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మాఫియా కు వ్యతిరేకంగా స్థానిక సిఐటియు కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులు శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య, ఏఐటీయూసీ ఏరియా అధ్యక్షులు వైఎస్ మణి సంయుక్తంగా మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో ఇసుక, మట్టి మాఫియా పేట్రేగిపోతోందన్నారు. కొందరు నాయకులు పార్టీలతో సంబంధం లేకుండా సిండికేట్ గా ఏర్పడి తెల్ల బంగారాన్ని దోచేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక మాఫియా దాహానికి తొట్టంబేడు మండలంలోనే ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో ఓ తండ్రీ, కొడుకు ఉండడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ వ్యాపారం జరిగిందని ఆరోపించిన కూటమి నేతలు అధికారంలోకొచ్చి నాలుగు నెలలు గడిచిపోతున్నా, ఎందుకు అప్పటి మాఫియా నేతలపై పీడీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఇసుక, మట్టి మాఫియాపై ఉక్కు పాదం మోపాలని కోరారు. ఇసుక ట్రాక్టర్ ఢ కొట్టి ప్రాణాలు కోల్పోయిన కంచి రాజేంద్ర, చైతన్య కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా, రెండెకరాల సాగుభూమినివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఇసుక, మట్టి మాఫియాకు వ్యతిరేకంగా కరపత్రాలను విడుదల చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య, గంధం మణి, కుమార్ వెంకటేష్, అన్వర్ బాషా, వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నాయకులు జనమాల గురవయ్య, పీడీఎస్యూ నాయకులు జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
