సఫాయిల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వ కృషి : కార్మిక శాఖ మంత్రి సుభాష్‌

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే పారిశుద్ధ్య కార్మికులైన సఫాయి సురక్ష పథకం కింద వారి ఆరోగ్యాన్ని ప్రభుత్వం కాపాడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తెలిపారు. సోమవారం ఉదయం రాజోలు ఏరియా ఆసుపత్రిలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా సఫాయి సురక్ష కింద నియోజకవర్గంలోని పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 1 వరకు పక్షం రోజులపాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు రోగాల బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్మికులకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇచ్చే కార్యక్రమం సఫాయి సురక్ష అని వివరించారు. పారిశుధ్య కార్మికులతో పాటు భవన నిర్మాణ కార్మికులకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. సెప్టెంబర్‌ 17 నుంచి మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ర్యాలీలు మానవహారాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలందరూ చెత్తను బహిరంగ ప్రదేశాలలో వేయకుండా మునిసిపాలిటీ సిబ్బందికి మాత్రమే అందజేయాలని ..బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయడం మలవిసర్జన చేయడం వంటి కార్యక్రమాలు చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో  రాజోలు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గాదంశెట్టి శ్రీదేవి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు ,ఎంపీడీవో సెట్‌ రాజ్‌ , ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్‌ పవన్‌ కుమార్‌ ప్రజాప్రతినిధులు అధికారులు , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️