ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం

ప్రజాశక్తి-ఆళ్లగడ్డ (నంద్యాల) : ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలంలో మధ్య దళారుల చేతిలో మోసపోయిన రైతులకు న్యాయం చేసిన పోలీస్‌ అధికారులకు, న్యాయవాదికి, మీడియా సోదరులకు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.రామచంద్రుడు కఅతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రుద్రవరం, అప్పనపల్లి, గోనవరం, పెద్ద కంబలూరు గ్రామాల్లో మొక్కజన్న ధాన్యాన్ని మధ్య దళారులైన పంతాల గోపాల్‌, కాసుల మనోహర్‌ లకు అమ్మి వారి చేతిలో రెండు కోట్ల రూపాయలు నష్టపోయిన రైతులకు వారిని మోసం చేసిన వారి వద్ద నుండి 45 శాతం అనగా 95 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసి రైతుల అకౌంట్లో వేయించిన ఆళ్లగడ్డ డి.ఎస్‌.పి ప్రమోద్‌ కి, సిరివెళ్ళ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ వంశీధర్‌ కి, రుద్రవరం ఎస్సై వరప్రసాద్‌ కి, ఆళ్లగడ్డ ప్రముఖ న్యాయవాది రమణయ్యకి, అందుకు సహకరించిన మీడియా సోదరులకు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీగా అభినందనలు తెలిపారు. రైతన్నల ఇబ్బందులను దఅష్టిలో పెట్టుకుని సకాలంలో దళారుల నుండి రైతాంగాన్ని కాపాడినందుకు తమ సంఘంగా కఅతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. భవిష్యత్తులో రైతులు మోసపోకుండా ఉండాలంటే ఇలాంటి మధ్య దళారులకు కఠినమైన శిక్షలు వెయ్యాలని అధికారులను కోరారు. మధ్య దళారుల చేతిలో రైతుల దోపిడీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రభుత్వం కూడా రైతులకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన మద్దతు ధరలు రైతులుకు తెలియజేసి వాటిని వెంటనే అమలు జరుపుటకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనందువల్లనే రైతులు మధ్య దళారులను ఆశ్రయించి వారి చేతిలో బలైపోతున్నారన్నారు. సకాలంలో రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం జరుగుతున్నందువలనే రాష్ట్రవ్యాప్తంగా మధ్య దళారుల దోపిడీ రోజురోజుకు తీవ్రమవుతుందన్నారు. రైతులకున్న అవసరాలను దఅష్టిలో పెట్టుకుని మార్కెట్‌ ధరల కంటే అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడం, తూకాల్లో మోసం చేయడం, చివరకు డబ్బులు ఇవ్వకుండా పారిపోవడం, లేదంటే ఐపీ పెట్టడం లాంటి సంఘటనలు తీవ్రతరం అవుతున్నాయన్నారు. అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలై చివరకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల అన్ని రకాల పంటలను ప్రభుత్వాలే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో రైతాంగం కూడా రాజకీయాల కతీతంగా సంఘటితంగా వుండి ప్రభుత్వాల ద్వారా మద్దతు ధరలు అమలు జరిపించుకొనేలా ఐక్య కార్యాచరణ ఉండాలన్నారు.

➡️