రాజముద్రతో పట్టాదారు పాస్‌ పుస్తకాలు

ప్రజాశక్తి – పంగులూరు. భూ యజమానులైన రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. మండల పరిధిలోని ముప్పవరం గ్రామంలోని టిడిపి కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రామాల వారీగా శనివారం మంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం జగన్మోహన్‌ రెడ్డి బొమ్మతో జారీ చేసిన పట్టాదారు పాస్‌ పుస్తకాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. భూ హక్కుదాలుగా ఉన్న వారందరికీ రాజముద్రలతో ఉన్న పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందజేస్తామన్నారు. వ్యవసాయ పంప్‌ సెట్లకు త్వరగా విద్యుత్‌ కనెక్షన్లు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంగులూరు నుంచి ముప్పవరం, పంగులూరు నుంచి తూర్పు కొప్పెరపాడు వైపు వెళ్లే ప్రధాన రహదారి మర్మమతులు నిలిచిన కారణంగా ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు మంత్రికి వివరించారు. రోడ్డు మరమ్మతుల విషయంలో జాప్యం పై అధికారులను మంత్రిగొట్టిపాటి ప్రశ్నించారు. ,పనులు వేగవంతం చేయాలని కోరారు.విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీపై చర్యలకు ఆదేశంపలుచోట్ల విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురవు తున్నాయని, ఈ చోరీలను అరికట్టటం తో పాటు వాటిని కొనుగోలు చేసిన వారి నుంచి సొమ్ము రికవరీ చేయాలని చీరాల డిఎస్‌పి మొయిన్‌ను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. నివేసిన స్థలాలు, భూ సమస్యలు పాలడెయిరీతో వస్తున్న పొల్యూషన్‌ సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని తహశీల్దారు సింగారావును ఆదేశించారు. పంగులూరు ,జాగర్లమూడి వారి పాలెం, అలవలపాడు, తదితర గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాల సమస్యలు పరిష్కరించాలని విద్యుత్‌ ఎడి మస్తాన్‌ రావును ఆదేశించారు. ట్రైసైకిళ్లు అందజేత ముప్పవరంలోని టిడిపి కార్యాలయంలో వికలాంగులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను అందజేశారు. బల్లికురవ మండలం లోని కొత్తపాలెం, గంగపాలెం, కొత్తూరు,వల్లాపల్లి, కొప్పెరపాడు, ఉప్పమాగులూరు మరియు బొడ్డువానిపాలెం, అద్దంకి కోరిశపాడు గ్రామాలకు సంబంధించిన బ్యాటరీ ఛార్జింగ్‌ ట్రైసైకిళ్లను అందజేశారు. .ఈ కార్యక్రమంలో మలినేని గోవిందరావు , వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు దమ్ము అంజయ్య, ఎపిఎం రాజారావు ,సిసి పేరయ్య, దొడ్డ వేణు, నాగినేని సాంబశివరావు, చింతల రామారావు పాల్గొన్నారు.

➡️