ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోవాలి : సిహెచ్‌.బాబురావు

విజయవాడ : ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ అజిత్‌ సింగ్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో సిహెచ్‌.బాబురావు స్థానిక సిపిఎం నేతలతో కలిసి పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు, పట్టభద్రులను కలుసుకొని శాసనమండలి ఎన్నికలలో చైతన్యంతో ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తిహొచేశారు. కేంద్ర బడ్జెట్‌ మోసాన్ని ప్రజలకు వివరించారు. విద్యుత్‌ చార్జీలు, సర్దుబాటు చార్జీల భారం తదితర సమస్యలను ప్రజలు నేతల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ … రానున్న పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఎన్నికల్లో ప్రలోభాలకు, ఒత్తిళ్లకు, భ్రమలకు లోను కాకుండా చైతన్యయుతంగా వ్యవహరించాలన్నారు. పెద్దల సభలకు మేధావులను ఎన్నుకోవాలని కోరారు. సాధారణ ఎన్నికలలాగా పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లోనూ కోట్లాది రూపాయలు కుమ్మరించి గెలవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనీ, అవినీతిమయం చేస్తున్నారని ఆరోపించారు. పట్టభద్రుల నియోజకవర్గాల్లో సైతం కొన్ని రాజకీయ పక్షాలు… మేధావులు, విద్యావేత్తలకు అవకాశం లేకుండా పెత్తనం చేయడం తగదన్నారు. రాజ్యాంగం.. చట్టసభలలో వివిధ తరగతుల వారికి పెద్దలకు, మేధావులకు శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించే అవకాశాన్ని ప్రధాన రాజకీయ పక్షాలు వమ్ము చేయటం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఓటర్ల చేర్పింపు మొదలు ఓట్లు వేయించే వరకు ధనమయం చేసి రాజ్యాంగ విలువకు విఘాతం కల్పిస్తున్నారని చెప్పారు. విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, తదితర వర్గాల వాణిని శాసనమండలిలో వినిపించే అవకాశం లేకుండా కోటీశ్వరులు ఆక్రమించే ప్రయత్నాలు చేయటం శోచనీయమన్నారు. పార్టీలకతీతంగా విద్యావంతులు, నిరుద్యోగులు, వివిధ తరగతుల ప్రజలు … డబ్బు సంచులతో ప్రభావితం చేసే చర్యలను తిప్పి కొట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. రాజకీయ నిరుద్యోగులకు పునరావసం కల్పించే కేంద్రంగా శాసనమండలిని వినియోగించే ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. నేడున్న పరిస్థితుల్లో విద్యావంతుల సమస్యలను ప్రతిబించే రీతిలో శాసనమండలి ఎన్నికలలో విజ్ఞతతో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఎన్నికలలో ప్రజలను వంచించే రీతిలో కేంద్ర బడ్జెట్‌ ని వినియోగించుకోవడం గర్హనీయమన్నారు. రూ.140 కోట్ల మంది సామాన్యుల నయా పైసా పన్నులు తగ్గించకుండా దేశ ప్రజలను వంచించే రీతిలో కేంద్ర బడ్జెట్‌ ఉండటం సిగ్గుచేటన్నారు. దేశంలోని 100 మంది బడా కార్పొరేట్‌ సంస్థలపై పన్నులు విధించి, రూ.140 కోట్ల మంది పైగా ప్రజలకు పన్నులు తగ్గించవచ్చునని తెలిపారు. సాధారణ ప్రజల కొనుగోలు శక్తి పెంచే రీతిలో చర్యలు తీసుకోవచ్చునని, కానీ బిజెపి కేంద్రం జీఎస్టీ, పెట్రోలు, డీజిల్‌ పై పన్నులు, సెస్సులు.. అప్పుల భారాలతో సామాన్యులను కొల్లగొట్టే విధానాలను కొనసాగించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు మరోసారి కేంద్రం మొండి చేయి చూపిందన్నారు. రాజధాని అమరావతికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా అప్పులతో సరిపెట్టిందని విమర్శించారు. విభజన హామీల అమలు ఊసే ఎత్తలేదన్నారు. భవిష్యత్తులో ఎన్నికలు జరగబోయే బీహార్‌ తదితర రాష్ట్రాలపై రాజకీయ దృష్టి తప్ప, ఆంధ్రప్రదేశ్‌ ను ఆదుకునే చిత్తశుద్ధి ప్రదర్శించలేదని చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న ఉపాధి, ధరల పెరుగుదల తదితర సమస్యలకు పరిష్కారం చూపలేదన్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ కు తగిన నిధులు రాబట్టడానికి ఉమ్మడి కఅషి సాగించాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. సామాన్య ప్రజలందరూ మోడీ, కేంద్ర ప్రభుత్వ మోసాలను గమనించి చైతన్యంతో వ్యవహరించాలని కోరారు. నేడు జరిగిన ఈ పర్యటనలో బాబురావుతో పాటు సిపిఎం నేతలు కే శ్రీదేవి, బి రమణరావు, కే.దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️