ఓటరు నమోదు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎన్.వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్ ప్రసాద్ తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు-కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గానికి 2025 పిబ్రవరి గానీ, మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్ ప్రసాద్ కోరారు. గుంటూరు, బ్రాడీపేటలోని యుటిఎఫ్ కార్యాలయంలో ఓటర్ల నమోదు కేంద్రాన్ని వారు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2007లో శాసన మండలి పునరుద్ధరించిన నాటి నుంచి పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఫోరమ్‌గా ఏర్పడి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల హక్కుల కోసం, ప్రజాతంత్ర హక్కుల పరిరక్షణకు అత్యంత నిజాయితీతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకటించిందని, నవంబర్ 6వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారాగానీ, ఆఫ్‌లైన్ ద్వారాగానీ నమోదు చేసుకోవాలని అన్నారు. 2021 అక్టోబర్ 31లోపు డిగ్రీ గానీ డిప్లొమా పూర్తి చేసిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదు ప్రక్రియలో ఫారం 18కు ఆధార్ కార్డు, డిగ్రీ లేదా డిప్లమా సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, పోటో తప్పనిసరిగా జతచేసి స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు. సమాచారం కోసం గుంటూరు, కృష్టా ఉమ్మడి జిల్లాల యూటిఎఫ్ కార్యాలయంలో అప్లికేషన్లు, ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అర్హత కలిగిన గ్రాడ్యుయేట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ ఎం.హనుమంతరావు గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్, నాయకులు జి.వెంకటేశ్వర్లు, ఎమ్‌డి.గయాసుద్దౌలా, జిల్లా కార్యదర్శులు సిహెచ్.ఆదినారాయణ, యు.రాజశేఖర్‌రావు, జి.వెంకటేశ్వరరావు, టి.ఆంజనేయులు, ఎ.శ్రీనివాసరావు, కె.కేదార్‌నాథ్, కె.ప్రేమ్‌కుమార్, ఎం.కోటిరెడ్డి, కె.ప్రభూజీ పాల్గొన్నారు.