ఘనంగా కామ్రేడ్‌ గుర్రాల పరంజ్యోతి వర్ధంతి

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని బడుగువానిలంకలో పోరాటాల యోధుడు ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్‌ గుర్రాల పరంజ్యోతి 19వ వర్ధంతి కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఏఐకేఎంఎస్‌ నాయకుడు రంప జాను అధ్యక్షతన జరిగిన సమావేశంలో కామ్రేడ్‌ పరంజ్యోతి చిత్రపటానికి వక్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హాజరైన అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్‌ జే.సత్తిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకట్‌ నాయుడు తదితరులు మాట్లాడుతూ కామ్రేడ్‌ పరంజ్యోతి పీడితి ప్రజల పక్షాన అలుపెరగని పోరాటాలు సాగించారన్నారు. కార్మికుల కూలీ రేట్లు కోసం, భూ పంపిణీ కోసం దళితులపై దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు సాగించారన్నారు. పేద ప్రజల పట్ల ఎంతో గౌరవంతో మెలిగారని ద్వారపూడి, మండపేట ఏరియాలో యూనియన్‌ ఏర్పాటుకు కఅషి చేశారన్నారు. ఆలమూరు, బడుగువానిలంక, దుళ్ళ, ఏడిద, వీరవరం, రాజానగరం మండలంలోని నందరాడ, నరేంద్రపురం, పాతతుంగపాడు, కొత్త తుంగపాడు, శ్రీకఅష్ణపట్నం వంటి అనేక గ్రామాల్లో భూములు సాధించారన్నారు. ఒక నిబద్ధతగల విప్లవ కమ్యూనిస్టుగా పేరు పొందారన్నారు. అందుకే ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో పోరాటాలు ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు తులూరి ప్రేమానందం, బుడుగు వెంకట్రావు, పొలుమాటి వెంకట్రావు, రేళంగి ఆదిలక్ష్మి, గరికిమిల్లు సుబ్బారావు, డబ్బా అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️