ప్రజాశక్తి – ఆలమూరు : కార్తిక బహుళ త్రయోదశి సందర్భంగా ఆది వైద్యుడు శ్రీధన్వంతరి స్వామి జయంతి వేడుకలు చింతలూరు స్వామి వారి ఆలయంలో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ద్విభాష్యం వెంకట సూర్య సుజన్ దంపతుల చేతుల మీదుగా శాస్త్రోక్తంగా స్వామికి అర్చక స్వాముల ఆధ్వర్యంలో వ్రత వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో కార్తిక బహుళ త్రయోదశిని ధన్వంతరి జయంతిగా జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందన్నారు. అలాగే మన రాష్ట్రంలో ధన్వంతరి ఆలయం ఒక్క చింతలూరు లోనే ఉండటం విశేషంగా వారు పేర్కొన్నారు. చింతలూరు శ్రీవెంకటేశ్వర ఆయుర్వేద నిలయం వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మించబడిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.