పట్టాలైనా ఇవ్వండి.. పథకాలైనా అమలు చేయండి..

Dec 12,2024 00:03

అధికారులకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు
ప్రజాశక్తి – క్రోసూరు :
పేదల సాగు చేసుకుంటున్న పోరంబోకు భూములకు పట్టాలివ్వాలని, లేకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా రెవెన్యూ రికార్డుల్లో అయినా నమోదు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు కోరారు. మండలంలోని గరికపాడులో బుధవారం జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సులో పలు అంశాలను ఆయన అధికారుల దృష్టికి తేవడంతోపాటు వినతిపత్రం ఇచ్చారు. సర్వే నంబర్‌ 132లో సాగు చేసుకుంటున్నారని, పోరంబోకు భూములను సాగు చేసుకుంటున్న పేదలు గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారు ఆయా భూముల్లో వివిధ పంటలు సాగు చేసుకుని కుటుంబాలు పోషించుకుంటున్నారని చెప్పారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంట నష్టం వాటిల్లితే పరిహారం దక్కక ఆర్థికంగా దెబ్బతింటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని, లేదా ప్రభుత్వం ఇచ్చేటువంటి పంట నష్ట పరిహారం, పెట్టుబడి సహాయాలు, ఇతర సంక్షేమ పథకాలు వర్తించేలా రెవెన్యూ రికార్డులో నమోదు చేయాలని, ఈ-క్రాప్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఏపూరి వెంకటేశ్వర్లు, సాగు దారులు షేక్‌ పెద మాబు సాహెబ్‌, షేక్‌ మహమ్మద్‌ షా, షేక్‌ సలీం పాల్గొన్నారు.

➡️