అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ మోసం

Mar 8,2025 23:51

సిఐటియు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నేతాజి
ప్రజాశక్తి-గుంటూరు :
అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఒ వారికి మేలు చేసేది కాదని, దగా చేసేది అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ మేరకు నేతాజి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజులుగా ప్రచారం చేసుకుందని తీరా 7వ తేదీన విడుదల చేసిన జిఒ ఒక బూటకం అని అన్నారు. రిటైర్మెంట్‌ పరిహారం అంగన్‌వాడీ టీచర్లకు రూ.50వేలు, హెల్పర్లకు రూ.20 వేలు గత అనేక సంవత్సరాలుగా ఇస్తున్నారని, గత ప్రభుత్వ హాయంలో ఈ సర్వీసు పరిహారం సరిపోదని, పెంచాలని 42 రోజుల సమ్మె చేపట్టారన్నారు. పోరాటం మధ్యలో ఉండగానే గత ప్రభుత్వం రూ.50వేలను లక్ష రూపాయలకు, రూ.20వేలను రూ.40వేలకు పెంచుతూ జిఒ ఇచ్చిందన్నారు. ఈజిఒను అంగన్‌వాడీలు అంగీకరించకుండా పోరాటం కొనసాగించారని తెలిపారు. ఈ క్రమంలో సమ్మె ముగింపు సందర్భంగా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో టీచర్లకు రూ.1.20 లక్షలు, హెల్పర్లకు రూ.60వేలు రిటైర్మెంట్‌ బెన్ఫిట్స్‌ ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. దాని ప్రకారం జిఒ ఇవ్వాల్సి ఉందన్నారు. అంగన్‌వా డీలు గ్రాట్యుటీ పొందటానికి అర్హులని సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చిందన్నారు. గ్రాట్యుటీ అంటే ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత రాజీనామా చేసినా, చనిపోయినా, ఇతర ఏకారణాలతోనైనా సర్వీసు నుండి మానుకుంటే ఒక్కొక్క సంవత్సరానికి 15 రోజుల చొప్పున ఆఖరి నెల జీతం ఎంత పొందుతున్నారో అంత గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన జిఒ అన్యాయంగా ఉందన్నారు. 62 ఏళ్లు పూర్తి అయితేనే గ్రాట్యుటీ ఇచ్చే విధంగా ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అది కూడా వర్కర్లకు రూ.1లక్ష, హెల్పర్లకు రూ.40వేలు మాత్రమే ప్రకటించారన్నారు. 62 ఏళ్లకు ఒక్క రోజు తగ్గినా గ్రాట్యుటీ రాదన్నారు. తక్షణమే ఈ జిఒను ఉపసంహరించుకొని, సమ్మె ఒప్పందం ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️