ప్రజాశక్తి – ఆలూరు (కర్నూలు) : ఈ నెల 18 నుండి 23వ తేది వరకు జరిగిన ఆసియా బీచ్ సెపక్ తక్ర చాంపియన్ షిప్ 2024 లో పురుషుల ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించిన కురువ మధు ను, తండ్రి బసవరాజు, సెపక్ తక్ర గురువు హనుమంతు రెడ్డి, వ్యాయమ ఉపాద్యాయులు కవిరాజు, సరోజ లను సోమవారం ఆలూరు శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కెంజెడప్ప శాలువల తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ కేంజెడప్ప మాట్లాడుతూ ట్యాలెంట్ ఎవరి సొత్తు కాదని మధ్యతరగతి కుటుంబంలో నుండి వచ్చి చదువుతూ క్రీడలో అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో ఆడి కాంస్య పతకం సాధించిన మధు తమ కళాశాలలో చదువుకున్న విద్యార్థి కావడం సంతోషించదగ్గ విషయమన్నారు. సెపక్ తక్ర క్రీడ గురువు హానుమంతరెడ్డి మాట్లాడుతూ తాను నేర్పించిన సెపక్ తక్ర క్రీడ ను జిల్లా, రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించిన శిష్యుడు మధు ను చూసి గర్విస్తున్నానని ఇంతకంటే గురువు కి ఏమి కావాలి అని ఆనందం వ్యక్తం చేశారు.అంతర్జాతీయ స్థాయిలో కాంస్య పథకం సాధించిన క్రీడాకారుడు మధుని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు.కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.