నెల్లూరులో మహత్తర భూపోరాటాలు..

Jan 26,2025 18:12
అమరవీరుల స్థూపం నెల్లూరులో మహత్తర భూపోరాటాలు..

అమరవీరుల స్థూపం
నెల్లూరులో మహత్తర భూపోరాటాలు..
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి నెల్లూరు జిల్లా భూ పోరాటానికి మహోన్నత చరిత్ర ఉంది.. ఎర్రజెండా చేతబూని పేదలు భూములు సాధించుకున్నారు. ఒకటి కాదు…రెండు కాదు..ఏకంగా 20వేల ఎకరాలు నిరుపేదలకు కమ్యూనిస్టులు ప్రధానంగా సిపిఎం నాయకులు పంపిణీ చేశారు. ఇది చరిత్ర.1975లో జరిగిన ఈ పోరాటం ప్రత్యేకమైంది. భూస్వాములు దాడులు, పోలీసుల నిర్బంధాలు, పోలీసుల కాల్పులు, జైలు జీవితాలు, ప్రాణాలు కోల్పోయాయి. చేతులు కోల్పోయారు. ఇలా ఎన్నో నిర్బంధాలను ఎర్ర జెండా నీడలో పేదలు ఎదిరించి నిలబడ్డారు. విజయం సాధించారు. సెల్లూరు జిల్లాలోని చెరువు లోతట్టు పోరంబోకు భూములు 10 వేల ఎకరాలు, మరో 10 వేల ఎకరాలు బంజరు భూములను పేదలకు పంపిణీ చేశారు. భూమి ద్వారానే పేదలు ఆర్థికాభివృద్ధి సాధిస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. నేడు అనేక గ్రామాల్లో పేదలు ఆ భూములు సాగుచేసుకొని జీవనం సాగిస్తున్నారు..నెల్లూరులో జరిగిన భూ పోరాటం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. యల్లాయపాళెం, సోమరాజుపల్లి, పెనుబల్లిలో జరిగిన వీరోచిత భూ పోరాటం ఎర్రజెండా ప్రత్యేకతను తెలియజేస్తుంది. 1973లో భూ సంస్కరణలు చట్టం చేశారు. 1975లో అమల్లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వానికి కాకి లెక్కలు చూపించి, భూస్వాములు బురిడికొట్టించారు. నెల్లూరు జిల్లాలోని భూముల వివరాలను సిపిఎం నాయకులు స్వీకరించారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జక్కా వెంకయ్య, చిట్టేటి రమణారెడ్డి, టిపి భానురాజు తదితరులు జిల్లా వ్యాపితంగా భూ స్వాముల చేతుల్లోని భూముల వివరాలు తెలుసుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమకాలంలోనే వెంకటగిరి రాజాల ఆధీనంలోని ఇనాం భూములకు వ్యతిరేకంగా 1937-38 కాలంలోనే ఆందోళనలు జరిగాయి. 1974 సమయంలో భూపోరాటాలు సాగాయి. 1977లో అప్పసముద్రం, కాసరపల్లి, నందవరం, మందాల, నాయుడిపల్లె, రెడ్ల దిన్నె, గ్రామాల్లోనూ ప్రజలు ఆందోళనకు దిగారు. ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు,కావలి, గూడూరు తాలుకాల్లోనూ 1978లో బంజర భూముల కోసం ఆందోళనలు చేశారు. ఈ సమయంలో రాష్ట్ర నాయకత్వం 50 మంది కార్యకర్తలతో కలిసి జిల్లా నాయకత్వం జిల్లా వ్యాపితంగా భూస్వాముల చేతుల్లోని భూములు గుర్తించి వాటిపై ఆందోళనలు దిగారు. కలెక్టర్‌ను అప్పటి కలెక్టర్‌ అర్జునరావు సీలింగ్‌ భూములు, చెరువు లొతట్టు భూములు, అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ వివాదంలోని భూముల వివరాలు బయటకు తీశారు. ఆర్‌డిఒల అధ్వర్యంలో జాయింట్‌ పార్మింగ్‌ సొసైటీలు ఏర్పాటు చేశారు. కొన్నింటిని పేదలకు పంపిణీ చేశారు. 1978 జులై 15 నెల్లూరు సదస్సు నిర్వహించారు. పేదలకు భూ పంపిణీ చేయాలనే డిమాండ్‌ వచ్చింది. సిపిఎం, సిపిఐ, ఇతర సంఘాలు పోరాటం ఉదృతం చేశారు. 1979 ఫిబ్రవరి 25న నెల్లూరు నగరంలో 10 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. నాయకులపై కేసులు పెట్టి, అరెస్ట్‌ చేశారు. భూముల్లో ఎగిరిన ఎర్రజెండాలు…!1979 పిబ్రవరి 27న పది ఎకరాలు పైబడిన మిగులు భూములు గుర్తించడం మొదలు పెట్టారు. పేదలు పెద్ద ఎత్తున ఎర్రజెండాలు పట్టి భూముల్లో దిగారు. ఒకే రోజు జిల్లాంతటా పేదలు ఎర్రదండులా కదిలారు. కోవూరు, నెల్లూరు తాలుకాల్లో పెద్ద సంఖ్యలో పేదలు కదంతొక్కారు. గూడూరు,కావలి, ఆత్మకూరు, ఉదయగిరి డివిజన్‌ల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో దిగారు. 50 గ్రామాల్లో 10 వేల మంది ప్రజలు 5 వేల ఎకరాల్లో ఎర్రజెండాలు పాతారు. పత్రికలు, ప్రజలు, కధలు కధలుగా చెప్పుకున్నారు. 144 సెక్షన్‌ విధించారు., ప్రజలను భయభ్రంతులు చేశారు. ఉద్యమ కేంద్రాల వద్ద పోలీసులు క్యాంపులు ఏర్పాటు చేశారు. క్యాంపుల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో చేరడంతో పోలీసులు నామమాత్రంగానే ఉండిపోయారు. భూస్వాములు, పోలీసుల దాష్టీకం….!కమ్యూనిస్టుల భూపోరాటంపై భూస్వాములు, పోలీసులు దాడులకు , దౌర్జన్యాలకు దిగారు. అందులో యల్లాయపాళెం, సోమరాజుపల్లి, పెనుబల్లి గ్రామాల్లో జరిగిన దాడులు జరిగాయి. కొడవలూరు మండలం, యల్లాయపాళెంలో 1979 మార్చి 2న ఉదయం గ్రామంలో పోలీసులు దాడులకు దిగారు. 18 సంవత్సరాల యువకులు గాలంకి తిరుపాలు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. వడ్లపూడి రమణమ్మ చేతికి బులెట్‌ గాయమైంది. రామచంద్రారెడ్డిఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. అనేక మంది యువకులు గాయపడ్డారు. ఈ ఘర్షణలో భూస్వాములకు చెందిన వ్యక్తి మృతి చెందారు. 1979లో మార్చిలో భూపోరాటం సందర్భంగా సోమ రాజుపల్లిలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తోటపల్లి నర్సయ్యకు చేయి పోయింది.20 మంది గాయపడ్డారు. మామిడిపూడి, కొత్తపాళెం, మైపాడు, సోమరాజుపల్లి, పాపిరెడ్డిపాళెం, ప్రాంతాల్లో భూ ములు గుర్తించి , భూముల్లో దిగారు. కోవూరు తాలుకా పెనుబల్లి గ్రామంలోనూ భూ పోరాటం పెద్ద ఎత్తున జరిగింది. 1979 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 7 వరకు భూపోరాటం సాగింది. 960 మందిపై కేసులు పెట్టారు. ఒకరు మృతి చెందారు. ఇద్దరికి చేతులు పోయాయి. వందలాది మంది గాయపడ్డారు. సుమారు 10 వేల ఎకరాలు చెరువు లోతట్టు భూములు, మరో 10 వేల ఎకరాలు బంజరు భూములు పేదలకు పంపిణీ చేశారు.

➡️