గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే

Apr 11,2025 17:34 #guntur

ప్రజాశక్తి – కలక్టరేట్ ( కృష్ణా) : స్వాతంత్రం రాకముందే సామాజిక సమస్యలపై తిరుగుబాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని వారినీ స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాల సాధనకు వారి అడుగుజాడల్లో నడవాలని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పిలుపునిచ్చారు.శుక్రవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని వలందపాలెం లో గల మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు .అనంతరం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన చిత్రపటానికి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, జిల్లా కలెక్టర్ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు సభను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగం 1952లో వచ్చిందని, అంతకుముందే నాగరికత లేని రోజుల్లో మహాత్మ జ్యోతిరావు పూలే తన జీవితమంతా బడుగు బలహీనవర్గాల ప్రజలకు అంకితం చేశారన్నారు.ఆ రోజుల్లో అణగారిన వర్గాల ప్రజలకు విద్య నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారన్నారు ఆనాడు స్త్రీలకు స్వేచ్ఛ ఉండేది కాదని, తరతరాలుగా అణచివేతకు గురయ్యారన్నారు. చదువు ద్వారానే అభివృద్ధి చెందాలనే మహోన్నత ఆశయంతో స్త్రీలు కూడా చదువుకుంటేనే పురుషులతో సమానంగా ఎదగగలరని ఆ రోజుల్లో తన సతీమణి సావిత్రిబాయి ద్వారా బాలికలకు ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటుచేసిన ఘనత పూలేదన్నారు. ఆ రోజుల్లో మహిళలు యుక్త వయసులో భర్త చనిపోతే వారు గుండు చేసుకుని జీవితకాలమంతా వంటింట్లోనే మగ్గిపోవలసిన పనిలేదని వితంతు వివాహాలను ప్రోత్సహించి వారిలో కొత్త ఆశలు చిగురించేలా చేశారన్నారు.జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ల కన్నా ముందే సంఘ సంస్కరణలకు ఆధ్యులు పూలే అని కొనియాడారు.జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ భారత దేశంలో సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయులు జ్యోతిరావు పూలే అన్నారు.మహారాష్ట్రకు చెందిన పూలే ఆనాటి పరిస్థితుల్లో ఎన్నో సమస్యలు గుర్తించి అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారన్నారు. ఆనాడు కులవివక్ష, అంటరానితనం వంటి చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవన్నారు. సమాజంలో అందరూ సమానంగా ఉండాలని ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు.ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించినప్పుడు అందరూ సమాజంలో ఎదగడానికి ఆస్కారం ఉంటుందని తొలినాళ్లలోనే గ్రహించిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అగ్రవర్ణాల వారికి చదువుకోవాలని ప్రోత్సహించినప్పుడు ఫూలే దానిని ఖండించి అందరికీ సమాన అవకాశాలు రావాలంటే అందరికీ చదువు అవసరమని చాటి చెప్పారన్నారు.దేశంలోనే మొట్టమొదటిసారిగా బాలికల విద్య కోసం ఒక ప్రత్యేక పాఠశాలను నెలకొల్పారన్నారు. తన సతీమణి సావిత్రిబాయి ద్వారా చదువు చెప్పించారన్నారుసత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి తన తుది శ్వాస ఉన్నంతవరకు సంఘ సంస్కరణలకే తన జీవితాన్ని ధారపోశారన్నారు.అలాంటి మహోన్నత వ్యక్తిని తలుచుకుంటూ ఆయన ఆశయాలను, ఆదర్శాలను గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాల్సి ఉందన్నారు.అంతకుమునుపు విద్యార్థిని విద్యార్థులు వందేమాతరం గీతంతో సభా కార్యక్రమం ప్రారంభించారు. పిజి విద్యార్థులు లిఖిత, జస్వంత్ పూలే జీవిత చరిత్రను వివరించారు.ఈ సందర్భంగా బీసీ, కాపు కార్పొరేషన్ల ఆధ్వర్యంలో 400 మంది లబ్ధిదారులకు 8 కోట్ల రూపాయల వ్యయంతో యూనిట్లు నెలకొల్పుటకు మెగా బ్యాంకు చెక్కును ఆర్టీసీ చైర్మన్, జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా 8 లక్షల రూపాయల వ్యయంతో హారిక, జ్యోతి శ్రీలక్ష్మి, శేషు కుమార్ లకు జనరిక్ మందుల షాపులు ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు అందజేశారు .
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ వైస్ చైర్మన్ సునీల్, డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, బీసీ సంక్షేమ అధికారి జి రమేష్, టి డబ్ల్యూ ఫణి ధూర్జటి, బీసీ కార్పొరేషన్ ఈడీ శంకర్రావు, ఆర్డిఓ స్వాతి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో ఆనంద కుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి చిన్న నరసింహులు,పలువురు బీసీ సంఘాల నాయకులు వసతి గృహాల సంక్షేమ అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

➡️