ఘనంగా జల దినోత్సవం

Mar 22,2025 21:34

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ :  మహారాజా స్వయం ప్రతిపత్తి కళాశాలలో శనివారం భూ విజ్ఞాన శాస్త్రం విభాగం, విజయనగరం భూ గర్భ జల విభాగం, జల గణన విభాగం సంయుక్తంగా ఘనంగా ప్రపంచ జల దినోత్సవం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పొరేషన్‌ కమిషనర్‌ నల్లనయ్య హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించాఉ. కళాశాల నుండి కోటచ గంటస్తంభం మీదుగా తిరిగి కళాశాలకు చేరుకుంది. ఈ ర్యాలీలో ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సిసి, సెట్విజ్‌ , నెహ్రూ యువ కేంద్రం సభ్యులు పాల్గొన్నారు. భూ జల వనరులు శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌ విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం భూగర్భ జలాలు ఇంకిపోతున్నందున ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు తవ్వుకొని నీటిని సమృద్ధిగా కాపాడుకోవాలని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఎం సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భూ విజ్ఞాన శాస్త్రం విభాగ అధిపతి డాక్టర్‌ ఎం గణపతి రావు, సహాయ ఆచార్యులు టి శంకర్రావు, కె.సత్యనారాయణ నాయుడు, కన్వీనర్లు బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.

‘సీతం’లో ప్రపంచ జల దినోత్సవ వేడుకలు

సీతం ఇంజినీరింగ్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ జల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది థీమ్‌ ‘హిమనీనదాలు సంరక్షణ – స్థిరమైన జల భవిష్యత్తు”పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ యడ్ల గోవిందరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తాజా నీటి వనరుల్లో హిమనీనదాలు కీలక భూమిక వహిస్తున్నాయని, వాటి పరిరక్షణ కోసం కృషి చేయాలనికోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డివి రామమూర్తి, కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ నీటి సంరక్షణ అనేది భవిష్యత్‌ తరాల కోసం అత్యంత అవసరమని తెలిపారు.

బైరిసాగరానికి జల హారతి

బొబ్బిలి : బొబ్బిలి యుద్ధ స్తంభం వద్దనున్న బైరిసాగరం చెరువుకు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు జల హారతినిచ్చారు. ప్రపంచ నీటి దినోత్సవ కార్యక్రమాన్ని బైరిసాగరం చెరువులో నిర్వహించారు. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల మాలతీ కృష్ణమూర్తి నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు జాగరపు ఈశ్వర్‌ ప్రసాద్‌, ప్రధానకార్యదర్శి గవిరెడ్డి రఘు చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

నీరే ప్రాణకోటికి జీవనాధారం

మెంటాడ : నీరే ప్రాణకోటికి జీవనాధారామని ఎంపిడిఒ భానుమూర్తి వెల్లడించారు. లెప్రా సొసైటీ ఆధ్వర్యంలో మెంటాడలోని గాయత్రి విద్యానికేతన్‌లో ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి వనరులు కాపాడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను నివారించొచ్చని చెప్పారు. భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. పిహెచ్‌సి వైద్యాధికారి కల్పన మాట్లాడుతూ ప్రతిఒక్కరికీ కనీస అవసరాలకు రోజుకు 55 లీటర్ల నీరు అవసరమని చెప్పారు. లెప్రా సొసైటీ కోఆర్డినేటర్‌ లెంక రమణ మాట్లాడుతూ నీటి వనరుల ఉపయోగం, జలవనరుల సంరక్షణ పద్ధతులపై వివరించారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్‌ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు హెచ్‌ఎం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ పి.ధనలక్ష్మి, కె.హైమ, గాయత్రి విద్యానికేతన్‌ ప్రిన్సిపల్‌ నారాయణరావు, వైద్యులు జ్యోతి, సూపర్‌వైజర్‌ పి.వి రమణ, లెప్రా సొసైటీ సిఆర్‌పిలు, తదితరులు పాల్గొన్నారు.

➡️