ప్రజాశక్తి-విజయనగరంకోట : విజయనగరం బాలోత్సవం ఆనందగజపతి కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థులకు కథా రచన , పాటలు పాడటం , పద్యాలు పాడటం, మట్టితో బొమ్మలు చేయడం , ఫోక్ డ్యాన్స్ , ఫాన్సీ డ్రెస్ కాంపిటేషన్ , నాటికలు , ఏక పాత్రాభినయం వంటి పోటీలు నిర్వహించారు. జిఎస్ చలం అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో బాలోత్సవం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ గత రెండేళ్లుగా విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసే విధంగా విజయనగర బాలోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోందన్నారు. నేటి కంప్యూటర్ యుగంలో పుస్తకాలకు బానిసలైన విద్యార్దులు అసలు బయటి ప్రపంచాన్ని మర్చిపోతున్నారని తెలిపారు. అందుకోసమే వారిలో కళలను బయటకి తీసే విధంగా అనేక పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్య వక్తలుగా పాల్గొన్న దవళ సర్వేశ్వరరావు, జిఎస్ చలం, వై. శ్రీనివాసరావు , చిన్నా దేవి మాట్లాడుతూ గతేడాదిలాగే ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారని , వారిని ప్రోత్సహిస్తున్న తల్లి తండ్రులకు , వారి పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. విద్యార్థులలో సజనాత్మకతను వెతికి తీసే విధంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని కోరారు , కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు డప్పు శ్రీను, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాము, సిహెచ్ వెంకటేష్ పాల్గొన్నారు.
