పచ్చిరొట్ట ఎరువుల సాగుకు వెనుకంజ

ప్రజాశక్తి – చాపాడు మండల పరిధిలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి పంట సాగుకు ముందుగా సాగు చేసే పచ్చిరొట్ట ఎరువుల సాగుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. ప్రతి ఏడాది జులై మెదటి వారంలో దుక్కిళ్లు చేపట్టి విత్తనాలు చల్లే వారు. జీలుగ, పెసర, జనుము విత్తనాలను చల్లేవారు. గత 20 రోజులుగా అప్పుడప్పుడు పడుతున్న వర్షాలకు భూములు కూడా పదును కావడంతో రైతులు దుక్కులు చేపట్టారు. పచ్చి రొట్ట ఎరువులు సాగు మాత్రం చేపట్టలేదు. ప్రభుత్వం సబ్సిడీతో జీలగలు, జనుములు కూడా సరఫరా చేసింది. అయితే ఎగువ ప్రాంతాల్లో మంచి వర్షాలు పడకపోవడం, రిజర్వాయర్‌లలో నీటి మట్టం అంతంత మాత్రమే ఉండడంతో రైతులు ఆలోచనలో పడ్డారు. ఆగస్టు మొదటి వారంలో కెసి కాలువకు నీరు విడుదల అవుతాయా లేదా అనే సందిగ్ధంలో పడ్డారు. వర్షాలు సరిగా పడకపోతే కెసి కాలువకు నీరు విడుదల కాదు. దీంతో పచ్చి రొట్టె ఎరువులు సాగు చేసి ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకని సాగుకు వెనుకంజ వేస్తున్నారు. విత్తనాలు సిద్ధంగా ఉన్నప్పటికీ చల్లకం చేపట్టలేదు. కాలువకు నీరు వచ్చిన తర్వాత వరి నార్లు సాగు చేసి పంటను సాగు చేయొచ్చని రైతులు భావిస్తున్నారు. ఇప్పటికే విత్తనాలను కూడా సేకరించి సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం సబ్సిడీతో జనుము విత్తనాలను బయోమెట్రిక్‌ విధానంతో రైతులతో రిజిస్ట్రేషన్‌ చేసుకుని నగదు చెల్లించిన తర్వాత విత్తనాలు ఆర్‌బికెల నుండి సరఫరా చేశారు. 720 క్వింటాళ్ల జనుములు మండలానికి మంజూరు అయ్యయని మండల వ్యవసాయ అధికారి మ్యాగీ తెలిపారు. బోరు బావులు, నీటి ఆధారాలు ఉన్న రైతులు మాత్రం పచ్చిరొట్ట ఎరువులను సాగు చేపడుతున్నారు. మిగిలిన రైతులు దుక్కిళ్లకే పరిమితమవుతున్నారు. ఈ ఏడాది రెండు మూడు దఫాలుగా పదునైన వర్షాలు పడడంతో పొలంలో గడ్డి అధికంగా మొలకెత్తింది. ఈ నేపథ్యంలో సేద్యాలు చేయక తప్పడం లేదని, ఆర్థికభారం పడుతుందని రైతుల్లో ఆందోళన నెలకొంది.

➡️