మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి

Jan 10,2025 17:06 #antapuram

ప్రజాశక్తి-పెనుకొండ : మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో  రిలే నిరాహార దీక్షలు  చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు 17 రోజుల సమ్మె సందర్భంగా హామీలు, జీవోలు రాతపూర్వకంగా ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని 7 నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదన్నారు. ఈ రిలే నిరాహార దీక్షలతో అయినా ప్రభుత్వం స్పందించాలని వారన్నారు. మరణించిన కార్మికులకు రెండు లక్షలు ఎక్స్గ్రేషియా, ప్రమాదంతో మరణించిన కార్మికులకు ఏడు లక్షలు, రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలన్నారు. పెండింగ్ లో ఉన్న పీఎఫ్ ఈఎస్ఐ సమస్య పరిష్కరించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం, జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు రూ.26వేల జీతం ఇవ్వాలి అని అన్నారు. కార్మికులకు పనిముట్లు బట్టలు, సబ్బులు చెప్పులు శానిటైజర్లు, మాస్కులు గ్లౌజులు, చీపుర్లు వెంటనే ఇవ్వాలన్నారు. 279 జీవో ప్రకారం 250 నుంచి 500 జనాభా నివసిస్తున్న చోట ఆరు మంది కార్మికులను పనిలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, చేనేత కార్మిక సంఘం నారాయణస్వామి, సిఐటియు నాయకులు మహబూబ్ బాషా, నరసింహ, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ వెంకటేష్, నాగమ్మ, ముత్యాలు, నరసింహులు, కార్మికులు రాఘవేంద్ర, ప్రసాద్, నరసింహ వెంకటేష్, జబ్బర్, చలపతి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

➡️