ప్రజాశక్తి – పాలకొండ : రాష్ట్రంలో 16 రోజుల సమ్మె సందర్భంగా ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు)తో గత ప్రభుత్వంలో అధికారులు చేసుకున్న ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్. సంజీవి, సహాయ కార్యదర్శి పడాల వేణు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఎపి మున్సిపల వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన స్థానిక నగరపంచాయతీ కార్యాలయం ఆవరణంలో మంగళవారం కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రిటైర్ అవుతున్న కార్మికులకు రూ.75వేలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని, వారి పిల్లలకు ఉద్యోగం ఇస్తామని గత సమ్మె ముగింపులో అధికారులు యూనియన్‌తో మినిట్స్ రాసుకున్నారని, వాటికి జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డెత్, సిక్ అయినవారి పిల్లలకు ఉద్యోగాలిస్తామని ఇచ్చిన హామీని నేటికీ అమలు చేయడం లేదని, వెంటనే కౌన్సిల్ తీర్మానం చేసి మరణించిన, అనారోగ్యాల పాలైన కార్మికుల కుటుంబాలకు, వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పురపాలక కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వయస్సు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీలు అమలు చేయకుంటే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పడాల వేణు, విమల, శ్రీదేవి, రఘు, సురేషు, ఆంజనేయులు పాల్గొన్నారు.
