ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు మార్గదర్శకాలు

Mar 9,2025 20:57

150గజాలలోపు గల ఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్‌ 

ఆపైన 451 గజాల వరకు 50శాతం లేదా సాధారణ ఛార్జీలు

అమలులో పారదర్శకత ఏమేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  ఇళ్ల స్థలాల క్రమ బద్దీకరణకు మార్గదర్శకాలు వెలువడ్డాయి. ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో జీవో నెంబర్‌ 30 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం 150గజాలలోపు గల ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. ఆపైన 451గజాల వరకు 50శాతం లేదా సాధారణ ఛార్జీలు విధిస్తారట. ఇందులో పేదల సంగతి కాస్త పక్కనబెడితే… పెద్దల విషయంలో ఏమేరకు పారదర్శకత ఉంటుందో వేచిచూడాల్సిందే. ప్రభుత్వ స్థలాల్లో 2019 అక్టోబర్‌ 15లోపు ఉన్న ఇళ్ల క్రమ బద్దీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇందులో అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలంలో ఆర్‌సిసి లేదా ఇంటిపైకప్పుతో కూడి ఇటుకల గోడల నిర్మాణాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. లబ్ధిదారుని కుటుంబం లేదా ఆ కుటుంబంలోని సభ్యుడి పేరు రాష్ట్రంలో మరెక్కడా సొంత ఇళ్లు లేకపోతేనే ఇది వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం స్కీముల ద్వారా ఇంతకు ముందు లబ్ధి పొంది ఉంటే తాజాగా కట్టిన ఇళ్లు రెగ్యులర్‌ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ అన్ని అర్హతలూ ఉంటే, సంబంధిత కుటుంబంలోని మహిళ పేరున మాత్రమే రెగ్యులర్‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. వీటన్నింటికన్నా ముఖ్యంగా దారిద్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు మాత్రమే క్రమ బద్ధీకరణ అమలుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీని ప్రకారం ఏడాదికి వార్షిక ఆదాయం రూ.1.20లక్షలకు మించరాదు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు, పిఎస్‌యు, కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగులకు అవకాశం లేదు. పది ఎకరాలకు మించని వ్యవసాయ భూమి లేదా తడి భూమి లేదా తడి, పొడి కలిపి 10ఎకరాలకు మించితే ఈ పథకం వర్తించే పరిస్థితి లేనట్టే. ఆదాయపన్ను చెల్లిస్తున్నవారు, నాలుగు చక్రాలవాహనదారులు, వ్యవసాయ కోసం ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రక్కులు ఉన్నవారికి కూడా మినహాయింపు ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో గరిష్ట ఆదాయం రూ.1.44లక్షలకు మించరాదు. కుటుంబానికి ఒక్కసారి మాత్రమే ఈ ఇళ్ల క్రబద్దీకర వర్తించే విధంగా రూపకల్పన చేశారు. ఈ నిబంధన ప్రకారం గతంలో ప్రభుత్వ స్థలం ఇంటిని నిర్మించున్నవారికి లేదా ఇప్పటికే ఆ ఇళ్లు విక్రయించినా ఈసారి లబ్ధి పొందేందుకు అవకాశం లేదు. ఇళ్ల క్రబద్దీకరణకు స్థల విస్తీర్ణాన్ని బట్టి ప్రభుత్వం కేటాయింపు ధర నిర్ణయించింది. ఇంటి విస్తీర్ణం, దిగు పేద, ఎగువ పేద అనే తీరున విభజించి చెల్లించాల్సిన ఛార్జీలను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈలెక్కన 150 గజాల వరకు ఉచితంగా ప్రభుత్వమే దఖలు పరుస్తుంది. పట్టా జారీచేసిన రెండేళ్ల తరువాత డి-పట్టాతోపాటు కన్వేయర్‌ డీడ్‌ ఉచితంగా అందజేయనున్నారు. 151గజాల నుంచి 300 గజాల్లో ఉన్న ఇళ్లకు సంబంధ స్థలానికి ప్రాథమిక విలువ కట్టి, దాన్నిబట్టి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారైతే రిజిస్ట్రేషన్‌ ఫీజులో 50శాతం, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారైతే సాధారణ ఫీజు చెల్లించాలి. 301 నుంచి 450 విస్తీర్ణంలోవున్న ఇళ్లకు కూడా పైన పేర్కొన్నట్టు ప్రాథమిక భూమి ఆధార విలువ ఆధారంగా 50శాతం లేదా సాధారణ ఫీజు చెల్లించాల్సివుంటుంది. 541గజాలకు పైగా ఉన్న ఇళ్లకు ఎపిల్‌, బిపిఎల్‌ అనేదానితో సంబంధం లేకుండా ప్రథమిక భూమి విలువలో 5రెట్లు విలువపై సాధారణ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించాల్సివుంటుంది. అర్హులైనవారు వార్డు లేదా గ్రామ సచివాయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని సంబంధిత విఆర్‌ఒ క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం సంబంధిత తహసీల్దార్లకు నివేదిస్తారు. అక్కడి నుంచి అప్రూవల్‌ కమిటీకి చేరుతాయి. ఆర్‌డిఒ లేదా సబ్‌- కలెక్టర్‌ చైర్మన్‌గాను, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌, తహశీల్దార్‌ సభ్యులుగా ఉండే ఈ కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేయనుంది.

➡️