కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు

Jan 31,2025 23:54

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై వివిధ తరగతుల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి రాజధాని అమరావతికి నిధుల కేటాయింపు అంశంతోపాటు రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై కూటమి నాయకులు ఎదురుచూస్తున్నారు. గతేడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణంగా కేటాయించారు. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ఇప్పించేందుకు కేంద్రం మధ్యవర్తిగా వ్యవహరించనుంది. 15 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లించే ఈ మొత్తాన్ని గ్రాంటుగా ఇవ్వాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ కోరాయి. కూటమి నాయకులు మాత్రం రుణం అయినా పర్వాలేదులే ముందు నిధులు వస్తే నిర్మాణాలు చేయవచ్చునని వారికి వారే సమాధాన పర్చుకున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతికి కేటాయించే నిధుల విషయంలో మరికొంత సమాచారం బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఉంటుందా లేదా అన్న అంశంపై ఆసక్తి ఏర్పడింది. రాజధాని అమరావతికి నూతన రైల్వే లైను, అవుటర్‌ రింగ్‌ రోడ్డు,అమరావతి-బెంగుళూరు జాతీయ రహదారి నిర్మాణం తదితర అంశాలు కూడా ప్రతిపాదనల్లో ఎంత వరకు ప్రాధాన్యత ఇస్తారనేదీ చర్చనీయాంశంగా మారింది. బడ్జెట్‌లో వ్వవసాయానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్టు చెప్పినా పంటలకు మద్దతు ధర కల్పించేందుకు స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సుల అమలుకు చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ఏమైనా తాయిలాలు ప్రకటిస్తారా అని ఆయా సంఘాల కార్మిక నాయకులు ఎదురుచూస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పిఎఫ్‌ ఖాతాదారుల పింఛన్ల పెంపుపై కూడా జిల్లాకు చెందిన దాదాపు లక్ష మంది ఎదురుచూస్తున్నారు. మరోవైపు వేతన జీవులకు సంబంధించి ఆదాయపు పన్ను మినహాయింపు పెంపుపై ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు, మధ్య తరహా పరిశ్రమల దారులు వేచి ఉన్నారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను పనులు మందగమనంగా సాగుతున్నాయి. 216 ఒంగోలు -కత్తిపూడి జాతీయ రహదారి విస్తరణ, రేపల్లే-బందరు నూతన రైల్వే లైను నిర్మాణంపై ప్రతిపాదనలపై బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పెండింగ్‌లటో ఉన్న నల్లపాడు-బీబీనగర్‌ రైల్వే లైను విస్తరణ, విద్యుద్దీకరణ, గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్లపై నిధులు కేటాయింపుపై ఇంకా అధికారులు పంపిన ప్రతిపానదనలకు ఆమో దంపై ఆసక్తి నెలకింది. రైల్వేలకు సంబంధించి గత పదేళ్లులో వందేభారత్‌ రైళ్లు క్రమంగా పెంచుతూ సాధారణ రైళ్లలో జనరల్‌ బోగీలు, స్లీపర్‌ బోగిలు తగ్గింపుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు రైలు ప్రయాణం భారంగా మారింది.

➡️