ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను టిడిపి, వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఫిబ్రవరి 3న సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 6 స్థానాలకు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కౌన్సిల్‌లో 56 కార్పొరేటర్లు ఉండగా వైసిపి నుంచి 46, టిడిపి నుంచి 9 మంది, జనసేన నుంచి ఇద్దరు గెలుపొందారు. వైసిపి నుంచి ఎన్నికల ముందు, ఆ తరువాత 15 మంది టిడిపిలోకి, నలుగురు జనసేనలో చేరారు. దీంతో కూటమి బలం 27కి పెరిగింది. వైసిపి బలం 29కు తగ్గింది. అంతేగాక మరికొంత మంది వైసిపిని వీడి టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం ఊపందుకోవడంతో అప్రమత్తమైన వైసిపి నాయకులు వీరిని ప్రత్యేక బస్సులో గురువారం సాయంత్రం నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ రాత్రికి హైదరాబాద్‌కు చేర్చారు. స్టాండింగ్ కమిటీకి వైసిపి తరుఫున నామినేషన్ దాఖలు చేసిన అడకా పద్మావతి కూడా టిడిపిలో చేరడం వైసిపి నాయకులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం వైసిపి నుంచి ఐదుగురు అభ్యర్థులు మాత్రమే ఉండగా టిడిపి నుంచి ఏడుగురు పోటీలో ఉన్నట్టయింది. మొత్తం ఆరు పోస్టులకు గాను టిడిపి, వైసిపి నుంచి చెరి ఆరుమందికి ఓటు వేయాల్సి ఉండగా వైసిపి నుంచి బరిలో ఉన్న అడకా పద్మావతి కూడా టిడిపిలో చేరడం వల్ల వైసిపి ఐదుగురే బరిలో ఉన్నారు. టిడిపి, వైసిపి మధ్య బలబలాలు దాదాపుగా సమానంగా ఉండటంతో ఎవరికి వారు తమ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా వైసిపి నుంచి గతవారం రోజుల్లో ఆరుగురు కార్పొరేటర్లు టిడిపిలోకి వెళ్లడం వల్ల ఆ పార్టీ నాయకులు అప్రమత్తమయ్యారు. అయితే టిడిపి, జనసేన కూటమి కార్పొరటర్లు కూడా మరో బస్సులోనే హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. సోమవారం స్టాండింగ్ కమిటీ ఎన్నికల తరువాత కార్పొరేషన్‌లో అనూహ్య పరిణామాలు జరుగుతాయని టిడిపి నాయకులు చెబుతున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల తరువాత మార్చిలో మేయర్‌పై అవిశ్వాసం పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని, పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు నిర్ణయం తీసుకుంటామని నాయకులు చెబుతున్నారు.
