లబ్ధిదారులకు 14 వేల కోట్లు వెంటనే చెల్లించాలి 

May 16,2024 11:53 #Guntur District
  • సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ

ప్రజాశక్తి-గుంటూరు : ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హడావిడి చేసి ఎన్నికల లబ్ధిదారులకు 14 వేల 165 కోట్లు వెంటనే చెల్లించడానికి ప్రయత్నించారని ఎన్నికల సంఘం ఎన్నికల అనంతరం లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించినా ఇప్పటివరకు ఆ వైపు దృష్టి మళ్లించలేదని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి తెలిపారు. ఈనెల 16వ తేదీ ఉదయం గుంటూరులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. దాదాపు 82% ఓటింగ్ జరగడం ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి అని దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో జరిగిందని వివరించారు. చెదురుముదురు సంఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని ఒక్క రీపోలింగ్ జరగాల్సిన అవసరం రాలేదన్నారు. ఎన్నికల అనంతరం చంద్రగిరి, మాచర్ల,గురజాల, తాడిపత్రి ప్రాంతాలలో జరుగుతున్న ఘర్షణలను నివారించడంలో పోలీసు యంత్రాంగం విఫలం అయిందన్నారు. భారతదేశంలోని అత్యధిక ఎన్నికల వ్యయం జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కనబడుతుందని అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు కలిసి దాదాపు 30 వేల కోట్లు ఖర్చు చేశారని అంచనా వేస్తున్నామన్నారు. ఓటర్ల జాబితాను నిరంతరం ప్రక్షాళన చేస్తూ కొత్త ఓటర్లను చేరుస్తూ మరణించిన వారి ఓట్లను డబుల్ ఎంట్రీలను తీసివేస్తూ ఉంటే ఓటింగ్ శాతం మరింత పెరిగేదన్నారు. ఒకే ఇంట్లోని ఓట్లు ఒకే పోలింగ్ బూత్ లో కాకుండా వివిధ పోలింగ్ బూత్ లలో ఉండడం వలన విఓటర్లు ఇబ్బంది పడ్డారన్నారు. 60 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక క్యూ ఉంటే బాగుండేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతం పెరగడానికి ప్రధానంగా పట్టణ ఓటింగ్ శాతం పెరగడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గత ఆరు నెలలుగా చేసిన కృషి ఫలించిందన్నారు. సదస్సులు ,రౌండ్ టేబుల్ సమావేశాలు, కళా యాత్రలు ద్వారా ఓటర్లను జాగృతులను చేసామన్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ లోని పౌర సంస్థలు, ప్రజాసంఘాలు, మేధావులను కలుపుకొని బలమైన పౌర వేదికను నిర్మిస్తామని తెలిపారు. గెలిచిన అభ్యర్థులు రాజకీయ అవినీతికి పాల్పడకుండా ఉండేటట్లు రాజకీయ అవినీతిపై సహజ వనరుల దోపిడీపై బలమైన పౌర సమాజం పోరాడాలన్నారు. అలా చేయడం ద్వారానే భవిష్యత్తులో ఎన్నికల వ్యయం తగ్గి మంచి అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగలరన్నారు. రంగం ప్రజా సంస్కృతిక వేదిక కన్వీనర్ ఆర్.రాజేష్ ఓటు ప్రాధాన్యతని తెలియజేస్తూ పాటలతో సభికులను అలరించారు. పల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి సంయుక్త కార్యదర్శి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ, పి.వి. మల్లికార్జునరావు ఏపీ ఎన్నికల నిఘా వేదిక గుంటూరు జిల్లా కార్యదర్శి, ప్రొఫెసర్ ఎన్.అరవింద్ అధ్యక్షులు, సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ, డా”ప్రత్యూష సుబ్బారావు ప్రముఖ సైకాలజిస్ట్, బత్తుల కృష్ణయ్య స్టెప్ అధ్యక్షులు.
మీడియా సమావేశంలో ప్రసంగించారు.

➡️