- రైతాంగాన్ని , కౌలు, వ్యవసాయ కార్మిక రంగాల ఊసే లేని బడ్జెట్
- కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్పోరేట్ ల కోసమే
- మాగంటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
- కుంచనపల్లిలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసిన రైతు, కౌలు రైతు నాయకులు.
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతు, కౌలు, వ్యవసాయ కార్మిక రంగాల ఊసేలేని దగాకోరు బడ్జెట్ అని, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు విమర్శించారు. ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లి నటరాజ కళామందిరం వద్ద బుధవారం సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్త పిలుపులో భాగంగా, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు వ్యతిరేకంగా బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి, రైతు, కౌలు రైతు లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. హరి బాబు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఐదు శాతం పెంచామని దేశ ప్రజలను మోసం చేశారని అన్నారు. పెంచిన బడ్జెట్ ఏ రంగానికి కేటాయించారో చెప్పాలన్నారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి 42.5% ఆదాయం వస్తే, రెండు శాతం వ్యవసాయ రంగం ద్వారా ఆదాయం వచ్చిందని అన్నారు. కానీ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. మద్దతు ధరల చట్టం చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా రైతాంగం అడుగుతున్న పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ఆదాయం మాత్రం పొందుతుందని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో గణనీయంగా పెరుగుతున్న కౌలు రైతులకు సంబంధించి బడ్జెట్లో ఎటువంటి ఊసే లేదని అన్నారు. పండించిన పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులను ఆదుకునే విధంగా ఉన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా సుమారు 3000 కోట్లను బడ్జెట్లో తగ్గించడం అన్యాయమన్నారు. విద్యార్థులకు, మహిళలకు, దళితులకు, గ్రామీణ అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ పరిపాలనకు నిదర్శనంగా ఉందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం ను నీరు కార్చే విధంగా కోతలు విధించి, గ్రామీణ పేదలను మోసం చేశారన్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేసే, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు తప్ప, రైతన్నను ఆదుకునే విధంగా కేంద్ర బడ్జెట్ లేదన్నారు. గతంలో కమ్యూనిస్టులు పోరాట ఫలితంగానే గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకువచ్చారని, గ్రామీణ ప్రాంతాలలో పేదలకు పనులు కల్పించబడ్డాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ రంగాన్ని అభివృద్ధి చేసేదిగా లేదని, బడ్జెట్ను పెంచి అన్ని వర్గాల రంగాలను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని దేశవ్యాప్త సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి కాజా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత సంవత్సరం 48. 440 కోట్ల రూపాయలు బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 52.144 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఐదు శాతం బడ్జెట్ పెంచామని డంబికాలు పలుకుతుందని అన్నారు. పెంచిన ఐదు శాతం బడ్జెట్ గ్రామీణ అభివృద్ధికి కానీ, రైతులకు, పేదలకు కానీ, సంక్షేమానికి గాని, వ్యవసాయ రంగానికి కానీ అభివృద్ధికి కేటాయించిన పరిస్థితి లేదన్నారు. వ్యవసాయ రంగం నుండి కేంద్రానికి రెండు శాతం ఆదాయం వస్తున్న వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మోసకారి బడ్జెట్ను ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని, గ్రామీణ అభివృద్ధిని ఇదేవిధంగా మోసగిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి, అమ్మిశెట్టి రంగారావు, సింగంశెట్టి రవి కిషోర్, శేషం శెట్టి శేషయ్య, ఎనుముల సాంబయ్య, శివారెడ్డి, బుల్ల సుబ్బారావు, పిన్నిస్, అమ్మిశెట్టి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.