వేముల దుర్గారావు, సిఐటియు తాడేపల్లి పట్టణ కార్యదర్శి.
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : చట్ట ప్రకారం ఏసీసీ కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని, లేబర్ కోర్టు, హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఎసిసి కార్మికుల సమస్య పరిష్కారం కాకపోవడం దుర్మార్గమని, సిఐటియు తాడేపల్లి పట్టణ కార్యదర్శి వేముల దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో ఎసిసి కార్మికుల రిలే నిరాహార దీక్షలు 60వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను కార్మిక నాయకురాలు టి. దుర్గా భవాని ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏసీసీ కార్మికుల సమస్యను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆయన అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంత్రి అయిన నారా లోకేష్ ఎన్నికల సమయంలో కార్మికులకు హామీ ఇచ్చాడని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు నారా లోకేష్ యాజమాన్యం ఎసిసి కార్మికులకు 43 కోట్ల నష్టపరిహారం ఇచ్చేందుకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం దీక్షలలో అల్లం విజయశ్రీ, టి శారద, వై రమాదేవి, దర్శి మల్లేశ్వరి, నారమ్మ కూర్చున్నారు. ఈ దీక్షలకు సంఘీభావంగా కూరపాటి స్టీవెన్, బి అంకయ్య, ఎస్ కే భాష, ఇస్మాయిల్, సుబ్బారావు, యెహోషువ, కృష్ణ, లాజరు, రామాంజియా, నాగేశ్వరరావు, వేముల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.