రోడ్కెక్కిన మిర్చి రైతులు

  • గుంటూరు యార్డు వద్ద మిర్చిని రహదారిపై పోసి నిరసన

ప్రజాశక్తి-గుంటూరు : మిర్చి రైతులు మరోసారి రోడ్డెక్కారు. తాము విక్రయించిన పంటపై రూ.ఐదు వేలు బోనస్‌ ఇవ్వాలని, కనీస మద్దతు ధర రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, ఎపి కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు మిర్చియార్డు వద్ద రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మిర్చిని రహదారిపై పోసి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం వరకూ ఆందోళన చేశారు. యార్డు అధికారులు, పోలీసులు పలుమార్లు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రైతు సంఘర రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, ప్రభాకర్‌రెడ్డి, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు మాట్లాడారు. గతేడాది రూ.23 వేలు ధర ఉండేదని, ప్రస్తుతం రూ.ఏడు వేలు, రూ.ఎనిమిది వేలకు కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద రూ.11,751లు మద్దతు ధర ప్రకటించడం అన్యాయమన్నారు. స్కీమ్‌ ప్రకటించి రెండు నెలలు అవుతున్నా ఇంత వరకూ విధి విధానాలు ప్రకటించలేదని తెలిపారు. దీంతో, ఈ స్కీమ్‌ ఎవరికి వర్తిస్తుందో? ఎవరికి వర్తించదో? స్పష్టత లేదన్నారు. తక్షణమే విధి విధానాలు ప్రకటించాలని, కొనుగోలు చేసిన ప్రతి క్వింటాలుపై రూ.ఐదు వేలు బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ధర్నా వద్దకు జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎ.భార్గవ్‌తేజ వచ్చి రైతులతో మాట్లాడారు. బోనస్‌ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, పంట విక్రయించుకున్న రైతుల వివరాలను సేకరించామని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి కంచుమాటి అజరుకుమార్‌, పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, తదితరుల పాల్గొన్నారు.

➡️