గంజాయి ముఠా పట్టివేత

Jun 10,2024 12:38 #Guntur District

ఎనిమిది మంది అరెస్ట్.. 2 కేజీల గంజాయి స్వాధీనం
ప్రజాశక్తి-తెనాలి : చాప కింద నీరులా పట్టణాన్ని చుట్టేసిన గంజాయి ముఠా ఆట కట్టించేందుకు పోలీసులు నడుం బిగించారు. ఒకటి రెండు రోజులు క్రితమే ఎమ్మెల్యే మనోహర్తో భేటీ అయిన పోలీసు అధికారులు గంజాయి విక్రేతలపై నిఘా పెట్టారు‌. ఒక్కసారిగా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రెండు కిలోల నిషేదిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టణ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం డిఎస్పి ఎం రమేష్ వెల్లడించిన వివరాల ప్రకారం త్రీ టౌన్ పోలీసులకు ఆదివారం సాయంత్రం అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాజీ రావు పేట లోని ఓ ప్రైవేటు స్థలంలో గంజాయి విక్రేతలు ఉన్నారని తెలుసుకుని, సీఐ ఎస్.రమేష్ బాబు సారథ్యంలో దాడి చేశారు. వారి వద్ద 2 కేజీలు గంజాయి కలిగిన సంచులను స్వాధీనం చేసుకున్నారు. కలకత్తాకు చెందిన మహమ్మద్ షఫీ సత్తార్, పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్, సయ్యద్ మహమ్మద్ సోహైల్ అలియాస్ బట్లు, డొంక రోడ్డు కు చెందిన రాపోలు నరసింహారావు, కొమ్మ తోటి బాలరాజు, చెంచుపేటకు చెందిన జమళ్ళమూడి గోపి, పాండురంగపేటకు చెందిన దిడ్ల ప్రభుదేవా అలియాస్ చంటి, మారిసుపేటకు చెందిన ఆకురాతి భరత్ అలియాస్ చిన్న ను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. నిందితుల్లో ఒకరైన మహమ్మద్ షఫీ సర్దార్ ఒరిస్సా రాష్ట్రంలో రెండు కేజీల గంజాయిని అతి చౌకగా కొనుగోలు చేసి, తెనాలి ప్రాంతానికి వచ్చి నిందితులతో కలిసి చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. నిందితులను అదుపులోకి తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ రమేష్ బాబు తో పాటు ఏఎస్ఐ దేవప్రసాద్, కానిస్టేబుల్స్ పి మురళి, వి శ్రీహరి, డి సురేష్, సిహెచ్ రామ్మూర్తి బృందాన్ని డిఎస్పి అభినందించారు.

➡️