సిపిఎం ధ్వజం
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్ర రాజధానికి నిధులు కేటాయించకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని సిపిఎం సీనియర్ నాయకులు వేముల దుర్గారావు, జొన్న శివశంకరరావు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆదివారం ఉదయం సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు వ్యతిరేకంగా సిపిఎం శ్రేణులు తాడేపల్లి పట్టణ పరిధిలోని ఉండవల్లి సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకరరావు, వేముల దుర్గారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్పోరేట్లకె అనుకూలంగా ఉందని అన్నారు. పేదల అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడని బడ్జెట్ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఎన్డీఏలో భాగస్వామి అయిన కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకపోవడం దుర్మార్గమన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా అధికారం చేపట్టిన కూటమి పార్టీలు రాష్ట్ర ప్రజలను మరో మారు మోసం చేశారని నాయకుల విమర్శించారు. ఒకవైపున ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, పేద మధ్యతరగతి సామాన్య ప్రజల పైన అధిక బారాలు వేసే కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని, రాజధానికి నిధులు కేటాయించని కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలు బుద్ధి చెబుతారని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, ఈమని రామారావు, ఇమ్మానుయేలు రాజు, నారిన నాగేశ్వరరావు, బొబ్బిలి రామారావు, ఎస్ కే భాష, కే మేరీ, కే శేషయ్య, ఏ శౌరి, ఇసుకపల్లి ఇస్సాక్, దర్శనపు విజయ్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.