వినుకొండ పట్టణంలో ముస్లిం మైనారిటీల భారీ ర్యాలీ
ప్రజాశక్తి-వినుకొండ: వక్ఫ్ బోర్డు భూములపై కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వినుకొండ పట్టణంలోని ముస్లిం మైనారిటీ సోదరులు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా పాల్గొన్న ముస్లింలు పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించి వక్ఫ్ బోర్డు భూములపై కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. స్థానిక శివయ్య స్తూపం వద్ద మనోహరంగా ఏర్పడి నిరసన తెలిపారు. వక్ఫ్ ఆస్తుల రద్దు, తద్వారా భారతీయ ముస్లింల మతపరమైన, సాంస్కృతిక,రాజకీయ, ఆర్థిక గుర్తింపును బలహీనపరిచే అవకాశం కల్పించే నిబంధనలను ఈ బిల్లు కలిగి ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇటువంటి చట్టం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా దేశంలోని అన్ని మతపరమైన మైనారిటీల హక్కులకు దీర్ఘకాలిక ముప్పును కలిగిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు యొక్క ముస్లిం గుర్తింపును మార్చే చర్య ఆమోదయోగ్యం కాదన్నారు. భవిష్యత్తులో ఇతర వర్గాలకు విస్తరించే ప్రమాదకరమైన దృష్టాంతాన్ని సూచిస్తుందన్నారు. భారీ ర్యాలీలో 2000 పైగా ముస్లింలు పాల్గొన్నారు.