ప్రజాశక్తి- తాడేపల్లి : 5.60 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న కృష్ణా నది పశ్చిమ డెల్టా కాల్వలో (బకింగ్ హామ్ కెనాల్) పెద్ద ఎత్తున తూటికాడ పేరుకుని నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి చివరి భూములకు నీరందడం లేదు. వీటికి తోడు కాల్వలో ప్లాస్టిక్ వ్యర్ధాలతో పాటు పాస్టర్ ప్యాలెస్ వ్యర్ధాలు కూడా తోడవడంతో నీరు నల్లగా మారింది. తాడేపల్లి పట్టణంలోని అనేక ప్రాంతాల్లో వాడిన డ్రెయినేజీ నీరంతా బకింగ్‌హామ్ కాల్వలో కలుస్తోంది. వీటితోపాటు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్వలోకి కొట్టుకొచ్చి నీరు భారీగా కలుషితమవుతూ దుర్వాసన వస్తోంది. ప్రకాశం బ్యారేజ్ పశ్చిమ నుండి ప్రారంభ మై ఈ కాలువ రైతుల పాలిటి వరప్రసాయి దీనిగా చెప్పుకోవచ్చు. ఇంతటి విశిష్టత గల కాలువలు పట్లఇరిగేషన్ అధికారులు అలసత్వం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ ఇంటి సమీపంలో తాడేపల్లి బకింగ్ హామ్ కాలవను స్థానికులు వివిధ రకాల అవసరాల కోసం వినియోగిస్తుంటారు. సమీపంలోనే కర్మకాండల భవనం, శివాలయం ఉన్నాయి. మాలధారణ చేసిన వారితో పాటు కర్మకాండలు పూర్తయిన తర్వాత ఇక్కడే స్నానాలు పూర్తి చేస్తారు. రజక వృత్తిదారులకు బట్టలుతికేందుకు ఇక్కడే రేవు కూడా ఉంది. దసరా, వినాయక చవితి పండుగలు సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలు బ్రిడ్జిపై నుండి నదిలో పడేస్తారు. అలా పడేసిన విగ్రహాలకున్న ఇనుము తుప్పు పట్టి, కాల్వలో స్నాన ఆచరించడానికి వచ్చిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మందు బాబులకు కూడా ఈ కాలువ అడ్డగా మారింది. ఖాళీ సీసాలు ఇక్కడే వేస్తుండడంతోపాటు కొన్నింటిని పగలగొడుతున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ కావటంతో కాల్వలు మరమ్మతులు పూర్తి చేయడానికి వీలుంటుందని, ఇరిగేషన్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు కోరారు. మరోపక్క స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుండటంతో ఎంటిఎంసి అధికారులను తమ పరిధిలోని బకింగ్‌హామ్ కాల్వలో మున్సిపల్ డ్రెయినేజీ ద్వారా వెళ్లిన ప్లాస్టిక్ వ్యర్ధాలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
