ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : చేసిన పని దినాలకు వేతనాలు ఇవ్వాలని అడిగితే ఇష్టమైతే చేయండి లేకపోతే రావొద్దని మున్సిపల్ కమిషనర్ మాట్లాడడం తగదని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) పల్నాడు జిల్లా గౌరవాధ్యక్షులు షేక్ మసూద్ అన్నారు. అధికారుల తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం చేపట్టిన ఆందోళన గురువారమూ కొనసాగించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి, సమీపంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసిన అనంతరం ఆందోళన చేపట్టారు. సిలార్ మసూద్ మాట్లాడుతూ పరిసరాల శుభ్రతకు, ప్రజారోగ్య పరిరక్షణకు పాటుపడే మున్సిపల్ కార్మికుల పట్ల అధికారులు నిర్లక్ష్య వీడాలన్నారు. 30 రోజులు పనిచేస్తే 15 రోజులకు వేతనాలు ఇవ్వడం ద్వారా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఆప్కాస్‌లో పేర్లు నమోదైనా కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వడం లేదని, రక్షణ పరికరాలూ ఇవ్వడం లేదని విమర్శించారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చరించారు. ఆందోళనకు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎ.ప్రసాదరావు సంఘీభావం తెలిపారు. మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సాల్మన్, కార్మికులు సమాధానం, ఇంద్రయ్య, జె.శ్రీను, దేవదానం, వీరయ్య, రాజు, ఖాదర్‌బాష, సాంబయ్య, జగన్నాథం, నాగరాణి, మల్లేశ్వరి, వీరమ్మ, లత, నాగమణి, సెల్మీ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కమిషనర్ పి.శ్రీధర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పెండింగ్ వేతనాలతోపాటు చెప్పులు, సబ్బులు, నూనెలు, యూనిఫామ్ వెంటనే ఇవ్వాలని, మస్టర్ పాయింట్లను ఐదు చోట్ల కాకుండా ఒకేచోట నిర్వహించాలని కోరారు. ఎండ తీవ్రంగా ఉన్నందున పని ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని, పండగ సెలవులు, క్యాజువల లీవులు, అమలు చేయాలని, టిఎల్‌ఎఫ్ కార్మికులకు పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయం నుండి పనిచేస్తున్న కార్మికులను వెంటనే ఆప్కాస్‌లో చేర్చాలని, అకారణంగా తొలగించిన కాండ్రగుంట మేరమ్మని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పనిభారం తగ్గించాలని, అదనపు పనులు చేసిన కార్మికులకు రెండు ఆఫ్ డ్యూటీలు కలిసి ఒకరోజుగా పరిగణించాలన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టర్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. కార్యక్రమంలో కె.కొండలు, ప్రతాప్, మార్తమ్మ, డి.పరమేశు, సిహెచ్.పద్మ, మేరీగ్రేస్, దేవి, ఎలమంద, కె.సాగర్, బి.పార్వతి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మాచర్ల : ప్రభుత్వాలు మారిన ప్రతిసారి చిరు ఉద్యోగుల జీవితాలతో చెలగాటం సరికాదని సిపిఐ ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి, ఎంసిపిఐ రాష్ట్ర నాయకులు అబ్రహం లింకన్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ధానిక సిపిఐ కొమెరా వీరాస్వామి భవన్‌లో అఖిలపక్ష సమావేశం గురువారం జరిగింది. నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొందరు మున్సిపాలిటిలో ఎలాంటి విధులు నిర్వహించకుండా మున్సిపల్ రికార్డుల్లో పేర్లు నమోదు చేసుకోని జీతాలు పొందారని, నిజాయితీగా పనిచేసిన కార్మికులను మాత్రం తొలగిస్తున్నారని అన్నారు. వైసిపి వారి ఇళ్లల్లో పని చేశారని కొందరిని, మరికొన్ని కారణలతో పని చేసే కార్మికులను మున్సిపల్ పాలకవర్గం పనుల్లోకి తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేసే కార్మికుల పట్ల సానుభూతిని ప్రదర్శించి వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే ఐక్య ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు ఎం.నాగేశ్వరరావు, ఎం.బాబురావు, ఎన్.రంగస్వామి, ఎం.కుమార్, జి.సైదులు, జి.అప్పారావు, ఎస్‌ఎమ్‌డి బాషా పాల్గొన్నారు.
