తెనాలిలో వడగండ్ల వాన బీభత్సం

Apr 14,2025 00:52

విరిగిపడిన స్తంభం, తెగిన తీగలు
ప్రజాశక్తి – తెనాలి :
పట్టణంలో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన, గాలులు బీభత్సం సృష్టించాయి. వేసవి తీవ్రత పెరిగిన సమయంలో వర్షం ఒకింత వాతావరణన్ని చల్లబరిచింది. దీనికి తోడు వడగండ్లు పడడంతో పిల్లలు, పెద్దలు సందడి చేశారు. అయితే వానతోపాటు గాలి ఉధృతకి స్థానిక జగ్గడిగుంటపాలెంలోని టిడ్కో గహ సముదాయం వద్ద ఓ సెల్‌ టవర్‌ కూలిపోయింది. అదే ప్రాంతంలో చెట్లు విరిగిపడ్డాయి. పట్టణంలో మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడి తీగలు తెగి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హుటాహుటిన స్పందించిన విద్యుత్‌ సిబ్బంది మరమ్మతులు చేపట్టి పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు.
వానతో దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి : రైతుసంఘం
ఆదివారం కురిసిన వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన జొన్న, మొక్కజొన్న రైతులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికే రెండుసార్లు వర్షం కారణంగా రైతులు దెబ్బతిన్నఆరని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి నాణ్యత ప్రమాణాలను లెక్కించకుండా పంటలను మద్దతు ధరకు కొనాలని కోరారు.
ప్రజాశక్తి – పెదకూరపాడు : మిరపకాయలు, మొక్కజొన్న, పొగాకు పంట కళాల్లో ఉండగా నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడులో ఆదివారం సాయంత్రం వానకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. పంటపై పట్టాలు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. శిల్పాలిన్‌ పట్టాలను సబ్సిడీపై కొన్నేళ్లుగా అందించని కారణంగా రైతులు పాత వాటినే వాడుకుంటున్నారు. వీటిల్లో కొన్ని అక్కడక్కడా దెబ్బతిని పంటపైకి నీరు చేరుతోంది. ఈ సారైన పట్టాలను అందించాలని రైతులు కోరుతున్నారు.

➡️