ప్రజాశక్తి -సీలేరు: పాడేరు ఐటిడిఎ పిఒ వి.అభిషేక్ చొరవతో జీకే వీధి మండలం ఎ.దారకొండ పంచాయతీ గొల్లపల్లి గ్రామ రహదారిపై విరిగిపడ్డ కొండచరియలను క్లియరెన్స్ చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుఫాను కారణంగా రహదారిపై కొండ చరియలు విరిగిపడి రోడ్డు పూర్తిగా మూసుకుపోవడమే కాకుండా, కొన్నిచోట్ల గ్రావెల్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు వీలుకాకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై ఎ.దారకొండ ఉపసర్పంచ్ మురళి, చంటిబాబు సమస్యను పాడేరు ఐటిడిఎ పిఒ అభిషేక్ దృష్టికి తీసుకువెళ్లి, రోడ్డును క్లియరెన్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన పిఒ, తక్షణమే రహదారి క్లియరెన్స్ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పిఒ ఆదేశాలతో అధికారులు గొల్లపల్లి గ్రామ రహదారి పనులను శని, ఆదివారాల్లో జెసిబితో క్లియర్ చేశారు. రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని తొలగించి, ఈ రహదారిలో రాకపోకలకు వీలుగా చర్యలు చేపట్టారు. గొల్లపల్లి, పెబ్బంపల్లి, తడకపల్లి గ్రామాలు కలుపుకొని పోయే రహదారి పనులు శరవేగంగా జరగడంతో ఆయా గ్రామ ప్రజలు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అభిషేక్‌కు ధన్యవాదాలు తెలిపారు.
జెసిబితో గొల్లపల్లి రహదారి క్లియరెన్స్ పనులు