అంచనాల్లో తలమునకలు

May 15,2024 21:09

ప్రజాశక్తి- చీపురుపల్లి : 40 రోజుల రాజకీయ సమరం ముగిసింది. రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలను ఎన్నికల్లో గుమ్మరించారు. అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ ఇచ్చిన నాటి నుంచి ఈ నెల 13 సోమవారం వరకు నియోజకవర్గమంతటా ఓటు చుట్టూ తిరిగింది. ప్రజాస్వామ్యం ఎప్పుడు గెలుస్తుందో చెప్పలేం కానీ ప్రతి ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు మాత్రం గెలుస్తున్నాయి. ప్రజలే గెలవాలి.. ప్రజలే ఎజెండా అంటూ నాయకులు ఇచ్చే ఉపన్యాసాలు నీటిపై రాతల్లా మారుతున్నాయి. 2024 మే 13న అసెంబ్లీకి సంబందించి చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా సాగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బుని నీళ్లలా ఖర్చు చేశారు. ఓటర్ల చుట్టూ కార్యకర్తలు ప్రధక్షిణలు చేస్తూ ఓటు వేయించుకున్నారు. షెడ్యూల్‌కి పోలింగ్‌కి 40 రోజులు సమయం ఉండడంతో అభ్యర్ధుల ఖర్చు తడిసి మోపెడైంది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడటంతో ఖర్చు అమాంతంగా పెరిగింది. అభ్యర్ధులు తమ గెలుపు కోసం చివరి రెండు రోజులూ ఓట్లు కొనుగోలులో వెనక్కి తగ్గకపోవడంతో కోట్లాది రూపాయల నగదు చేతులు మారాయి. దబ్బుతో పాటు కొత్తగా నమోదు చేసుకున్న యువ ఓటర్లు ఉత్సాహం చూపడంతో పోలింగ్‌ శాతం పెరిగింది.విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీచీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం అత్యంత ఖరీదైన నియోజకవర్గంగా మారింది. ఇక్కడ నుంచి వైసిపి తరుపున మంత్రి బొత్స సత్యనారాయణ, టిడిపి నుంచి కిమిడి కళావెంకటరావు ప్రధానంగా పోటీ పడ్డారు. వీరిరువురు సుమారు 40 కోట్ల ్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. షెడ్యూల్‌ విడుదైలనప్పటి నుంచి పోలింగ్‌ పూర్తయ్యే వరకు సభలు, సమావేశాలు, ప్రచారాలు, ర్యాలీలతో పాటు ఓటర్లకి డబ్బు పంపిణీ చేసే వరకు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు నియోజకవర్గంలోని ప్రజలు, విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు గెలిచారంటే.! నియోజకవర్గం పునర్విభజన జరిగినప్పటి నుంచి చీపురుపల్లి నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం పెరుగుతూ వస్తోంది. పెరిగిన శాతంతో పాటు పోటీ చేసే అభ్యర్దులు మారి మారి గెలుస్తున్నారు. 2014లో నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 1,88,978 ఉండగా 1,53,273 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పటిలో 81.1 శాతం పోలింగ్‌ జరిగింది. కాగా అప్పటిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో టిడిపి తరుపున పోటీ చేసిన కిమిడి మృణాలిని 63,787 ఓట్లు సాధించి బొత్స సత్యనారాయణపై 20,842 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. కాగా కాంగ్రేస్‌ పార్టీ తరుపున పోటీ చేసిన బొత్స సత్యనారాయణకు 42,945 ఓట్లు రాగా, వైసిపి తరుపున పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్‌కు 42,179 ఓట్లు లభించాయి. 2019లో జరిగిన ఎన్నికలలో నియోజకవర్గంలో 1,98,832 మంది ఓటర్లుండగా 1,65,174 మంది ఓటు హక్కుని వినియోగిం చుకున్నారు. ఈ ఎన్నికలలో 83 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొ న్నారు. వైసిపి తరుపున పోటీ చేసిన బొత్స సత్యనారాయణకు 88,586 ఓట్లు లభించగా టిడిపి తరుపున పోటీ చేసిన కిమిడి నాగార్జునుకి 61,879 ఓట్లు లభించాయి. కాగా కిమిడి నాగార్జునపై బొత్స సత్యనారాయణ 26,707 ఓట్లు మెజార్టి సాధించారు. 2024లో నియోజకవర్గంలో 2,05,484 మంది ఓటర్లుండగా వీరిలో 83.48 శాతంతో 1,71,533 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ లెక్కన గత రెండు దపాలు జరిగిన ఎన్నికలలో పోలింగ్‌ శాతం పెరగడంతో గెలుపొందే అభ్యర్ధులు మారారు. ఈ దఫా కూడా గతం కంటే పోలింగ్‌ శాతం మారడంతో అధికార పార్టీలో గుబులు పుట్టు కొస్తోందిన విశ్లేషకులు అంటున్నారు. టిడిపి మాత్రం పెరిగిన ఓటింగ్‌ శాతంపై గతంలో మాదిరీగానే తమ గెలుపు తధ్యం అనే ధీమాతో ఉన్నారు. ప్రభుత్వ పథకాలు నచ్చడం వల్లే ఓటింగ్‌ శాతం పెరిగిందని వైసిపి నాయకులు చెబుతున్నారు. ఈ క్రమ ంలో గత రెండు రోజుల నుంచి ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు తీరిక లేకుండా లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరి పక్షాన ఓటర్లు నిలబడ్డారో తమకు ఎంత వరకు లబ్ది చేకూరుతుందోనని నాయకులు బూత్‌ల వారీగా పోలైన ఓటర్‌ లిస్టులు తెప్పించుకొని మరీ లెక్కలే స్తున్నారు. ఎవరి లెక్క కరెక్ట్‌ అవుతుందో..ఎవరి లెక్క తప్పుతుందో జూన్‌ నెల 4న తేలనుందిబొత్స ఆదిక్యతపై కోట్ల, తాడ్డి ప్రభావమెంత? మండలంలో 82.65 శాతం పోలింగ్‌మెరక ముడిదాం: మండలంలో ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గత 2019 కంటే ఎక్కువగా పోలింగ్‌ జరిగింది. మండలంలో 46,869ఓటర్లు ఉండగా, 38,739మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 ఎన్నికలలో ఈ మండలం నుంచి బొత్స సత్యనారాయణకు 8,888 మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ రాదని చాలా మంది చర్చిం చుకుంటున్నారు. మండలంలో ప్రధాన పంచాయతీలు చినబంటుపల్లి, గర్భాంకు చెందిన అప్పటి వైసిపి నాయకులు కోట్ల మోతిలాల్‌ నాయుడు, కోట్ల క్రిష్ణమూర్తి నాయుడు, తాడ్డి చంద్రశేఖర్‌ టిడిపిలో కలిసిపోవడంతో వారి ప్రభావం వైసిపిపై పడుతుందన్న చర్చ జరుగుతోంది. ఆయా పంచాయతీల్లో ఓటర్లు మొగ్గు వైసిపి కంటే టిడిపి వైపే ఉన్నట్లు తెలిస్తోంది. మరో పెద్ద పంచాయతీ సోమలింగాపురం పరిధిలోని గోపనవలస, గొల్లల మర్రివలస గ్రామాలలో టిడిపికి మెజారిటీ రావటానికి అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. కొర్లాం పంచాయతీ, మెరక ముడిదాం, భీమవరం పంచాయతీల నుంచి వైసిపికి అత్యధిక మెజారిటీ వస్తుందని వైసిపి నాయకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా మండలం నుంచి అధిక మెజారిటీ బొత్సకు రాకుండా కోట్ల, తాడ్డి ప్రభావం చూపినట్లు ప్రచారం జరుగుతోంది.

➡️