ప్రజాశక్తి – రుద్రవరం : మండల వ్యవసాయ అధికారి బీ వి.నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రుద్రవరం, ఆర్ నాగులవరం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన రైతులతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 11, 12 తేదీలలో అల్పపీడనం వలన వర్షాలు కురుస్తాయి అని తెలిపారు. అందుకు అనుగుణంగా కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి కోతలను నిలిపివేయాలని తెలిపారు. ఇదివరకే కోసిన ధాన్యాన్ని టార్పాలిన్స్ తో కప్పుకుని ధాన్యాన్ని కాపాడుకోవాలని , అదేవిధంగా కళ్ళల్లో ఆరబోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని తెలిపారు. వర్షానికి తడిచిన ధాన్యాన్ని రంగు, చెడు వాసన రాకుండా ఉండడం కోసము ఒక కింటా ధాన్యానికి ఒక కేజీ ఉప్పును చల్లుకోవడం వలన గింజ మొలకెత్తకుండా చెడిపోకుండా నివారించుకోవచ్చును. అదేవిధంగా రబీ పంటలో సాగు చేసిన వివిధ రకాల పంటలను ప్రతి రైతు.. రైతు సేవ కేంద్రాల సిబ్బంది ద్వారా పంట నమోదు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పంటల బీమా చేసుకోవాల్సిన రైతులు వరికి ఈనెల 31, మిగతా పంటలైన జొన్న వేరుశనగ డిసెంబరు 15 చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. కావున రైతులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రాజు, ఫహీమా తబస్సుమ్, రైతు సేవ కేంద్రాల సిబ్బంది నాగపనింద్ర కుమార్ లాలూ గోపి రైతులు పాల్గొన్నారు.
