వైసిపిలో కష్టపడి నష్టపోయాం.. : హెనీ క్రిస్టీనా

తెనాలి: వైసిపిని నమ్ముకుని 12 ఏళ్లుగా ఎంతో నష్టపోయామని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానన్న జగన్‌ అన్ని విధాల నష్టపరిచారని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టీనా అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్డులోని ఓ హోటల్లో శనివారం జరిగిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో క్రిస్టీనా మాట్లాడుతూ తన భర్త కత్తెర సురేష్‌ కుమార్‌ను వైసిపి తాడికొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించిన జగన్‌ దాదాపు రెండేళ్ల పాటు శ్రమించిన తదుపరి తమను కాదని మరొకరికి సీటును కేటాయించారన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చిన జగన్‌ దానిని నిలుపుకోలేదని చెప్పారు. దళితులకు వైసిపిలో గౌరవం లేదని, అంతా పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని, టిడిపి పై నమ్మకంతో తాము పార్టీలో చేరామని చెప్పారు. మనోహర్‌ మాట్లాడుతూ తెనాలి అభివృద్ధి పథంలో నడిపించేందుకు తనను గెలిపించాలని, తనతోపాటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు వై.రఘునాధబాబు, మహిళా కమిషన్‌ మాజీ చైర్‌ పర్సన్‌ ఎన్‌.రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ జి.ఉమ, హార్వెస్ట్‌ ఇండియా అధినేత డాక్టర్‌ కె.సురేష్‌ కుమార్‌, పి.రవిశంకర్‌, డాక్టర్‌ మనోహరం, ఎ.జయలక్ష్మి, ఎన్‌.సుధాకర్‌, ఎస్‌.రామారావు, హరిప్రసాద్‌, వి.సాంబిరెడ్డి, ఎస్‌.నాగరాజు, పి.సురేష్‌ బాబు, హెచ్‌.గౌరీశంకర్‌ పాల్గొన్నారు.

➡️