ప్రజాశక్తి -నక్కపల్లి (అనకాపల్లి) :హెటిరో ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె లోకనాథం కోరారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్, విశాఖ జిల్లా నాయకులు పి మణిలతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ హెటిరో డ్రగ్స్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫార్మా పరిశ్రమల్లో కార్మికుల ప్రాణాలను యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయని తెలిపారు. భద్రతా ప్రమాణాలను పాటించడం లేదన్నారు. గతంలో హెటిరో పరిశ్రమలో ప్రమాదాలు సంభవించి కార్మికులు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయని, అప్పుడే చట్టపరమైన చర్యలు తీసుకొని ఉంటే ఈ ప్రమాదం సంభవించేది కాదని పేర్కొన్నారు. ఫార్మా పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు, విషవాయువుల లీకేజీలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.
