ఎస్‌ఎల్‌డిపి శిక్షణలో గుండెపోటుతో హెచ్‌ఎం మృతి

Nov 28,2024 20:23

 ప్రభుత్వమే కారణం

శిక్షణను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌

మృతునికి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి

డిఇఒ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నిరసన

ప్రజాశక్తి-గజపతినగరం, భామిని, విజయనగరంటౌన్‌  : గజపతినగరం మండలం మరుపల్లి వద్ద బాలాజీ పాలిటెక్నిక్‌ కళాశాలలో జరుగుతున్న ఉపాధ్యాయులు (ఎస్‌ఎల్‌డిపి) స్కూలు లీడర్‌షిప్‌ రెసిడెన్షియల్‌ శిక్షణలో ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు. పాలకొండ పంచాయతీ సీతంపేట రోడ్డులో నివాసముంటున్న సిరిపురం శ్రీనివాసరావు (58) శిక్షణకు హాజరయ్యారు. గురువారం తెల్లవారి 8గంటల సమయంలో గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆయనకు భార్య చూడామణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె ఎంబిబిఎస్‌, చిన్న కుమార్తె ఐఐటి చదువుతున్నారు. చూడామణి నగర పంచాయతీ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలో ప్రధానోపాధ్యాయులకు స్కూలు లీడర్‌షిప్‌ పేరిట ఆరు రోజులు పాటు శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా మరుపల్లిలోని బాలాజీ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఆరు రోజులు పాటు నిర్వహిస్తున్న శిక్షణకు పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం నులకజోడు ఎంపియుపి స్కూలు హెచ్‌ఎ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఉపాధ్యాయులంతా సౌకర్యాలు లేకపోయినా విద్యాశాఖ ఆదేశాల మేరకు అక్కడే రాత్రిపూట ఉంటున్నారు. ఈనేపథ్యంలో గురువారం ఉదయం ఆయన గుండెపోటుకు గురై మృతి చెందారు. విషయం తెలుసుకున్న విజయనగరం, పార్వతీపురం మన్యం డిఇఒలు మాణిక్యంనాయుడు, ఎన్‌.తిరుపతినాయుడు అక్కడికి చేరుకొని హెచ్‌ఎం మృతదేహాన్ని పరిశీలించారు. యుటిఎఫ్‌ నాయకులు పి.రమేష్‌చంద్ర పట్నాయిక్‌, చింతా భాస్కరరావు అక్కడికి చేరుకొని విచారం వ్యక్తం చేశారు. సౌకర్యాలు లేకుండా ఇలాంటి శిక్షణ ఇవ్వడం సరికాదని, వెంటనే శిక్షణనురద్దు చేయాలని ఉపాధ్యాయులంతా నిరసన తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల మొండి వైఖరి నశించాలని, ఉపాధ్యాయ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులకు విషయం తెలియడంతో వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని స్వగ్రామం తరలించారు.

శిక్షణలోఉపాధ్యాయుడు మృతికి ప్రభుత్వమే కారణం

డిఇఒ కార్యాలయం వద్ద నిరసన

విజయనగరం టౌన్‌ : మరుపల్లిలోని ఎస్‌ఎల్‌డిపి ట్రైనింగ్‌ సెంటర్లో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు మృతికి రెసిడెన్షియల్‌ శిక్షణ ఇవ్వడమే కారణమని, మరణించిన ఉపాధ్యాయుడు కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. గురువారం డిఇఒ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులకు బోధనతో సంబంధం లేకుండా శిక్షణల పేరుతో మానసిక ఒత్తిడికి గురి చేయడం వలన హెచ్‌ఎం శ్రీనివాసరావు మరణించారని అన్నారు. గతంలో కూడా ఒక ఉపాధ్యాయుడు వేరే జిల్లాలో మృతి చెందారని తెలిపారు. గత ప్రభుత్వం విధానగానే ఈ ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమన్నారు. రెసిడెన్షియల్‌ మోడ్‌లో కాకుండా నాన్‌ రెసిడెన్షియల్‌ విధానంలో ఇవ్వాలని, బోధనకు ఆటంకం లేకుండా శిక్షణలన్నీ వేసవి సెలవుల్లో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గరివిడి : ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు మృతికి నిరసనగా గరివిడి మండల విద్యా వనరుల కేంద్రం వద్ద భోజన విరామ సమయంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని, రెసిడెన్సియల్‌ శిక్షణను, ఉపాధ్యాయులను ఒత్తిడి కి గురిచేసే శిక్షణను రద్దుచేయాలని, మరణించిన ఉపాధ్యాయునికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. రాము, జిల్లా నాయకులు ఎ.సత్య శ్రీనివాసు, జి.పద్మావతి, మండల బాధ్యులు రవికుమార్‌, గోపాలకృష్ణ, సూరి శ్రీను, ఎం. సూర్యనారాయణ, ఐక్య సత్యనా రాయణ, బి.బంగార్రాజు, డి.సతీష్‌, కనకేశ్వర రావు, వరప్రసాద్‌, కోట్ల రమణ, తదితరులు పాల్గొన్నారు.

➡️